జనసేనలోకి పంచకర్ల..టీడీపీ సీటుపై కన్ను.!

వైసీపీలో కొనసాగుతున్న ఆధిపత్య పోరు వల్ల కొందరు నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. సీటు విషయంలో చాలా చోట్ల రచ్చ నడుస్తుంది. ఈ క్రమంలో సీటు గ్యారెంటీ లేదనుకునే నేతలు వైసీపీని వీడుతున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వైసీపీని వీడారు. వాస్తవానికి ఈయన ఇప్పటికే రెండు పార్టీలు మారారు. ఇప్పుడు మళ్ళీ వైసీపీని వీడి జనసేనలో చేరబోతున్నారు.

ఇక జనసేనలో చేరి సీటు దక్కించుకుని గెలవాలని చూస్తున్నారు. అయితే టి‌డి‌పితో పొత్తు ఉంటేనే గెలుపు సాధ్యమవుతుంది. పొత్తులో పెందుర్తి సీటు దక్కించుకోవాలని చూస్తున్నట్లు తెలిసింది. ఎందుకంటే గతంలో ఈయన ప్రజారాజ్యం నుంచి పెందుర్తిలో పోటీ చేసి గెలిచారు. 2009లో ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత ప్రజారాజ్యం, కాంగ్రెస్ లో విలీనం కావడంతో కాంగ్రెస్ లో పనిచేశారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీని వీడి..2014లో టి‌డి‌పిలోకి వచ్చి ఎలమంచిలి ఎమ్మెల్యేగా గెలిచారు.

2019లో ఎలమంచిలి నుంచి పోటీ చేసి చాలా తక్కువ ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు. ఓడిపోయాక వైసీపీలోకి జంప్ కొట్టారు. ఇక అక్కడ సీటుపై గ్యారెంటీ లేదు. పైగా వైవీ సుబ్బారెడ్డి..పెందుర్తి, ఎలమంచిలిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలే పోటీ చేస్తారని చెప్పారు. దీంతో పంచకర్ల… వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి పవన్ ని కలిశారు. జనసేనలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.

అయితే జనసేనలో చేరి టి‌డి‌పి పొత్తులో భాగంగా పెందుర్తి సీటు దక్కించుకోవాలని చూస్తున్నారని టాక్. కానీ అక్కడ టి‌డి‌పి సీనియర్ బండారు సత్యనారాయణమూర్తి ఉన్నారు..కాబట్టి ఆ సీటు దక్కడం కష్టం. ఒకవేళ జనసేన సింగిల్ గా పోటీ చేస్తే పంచకర్లకు ఛాన్స్..లేదంటే వేరే ఆప్షన్ చూసుకోవాలి.