నిమ్మలపై కొత్త ప్రత్యర్ధి..ఈ సారి అడ్డుకోగలరా?

రాజకీయాల్లో ప్రజా బలం నాయకులని ఓడించడం అసాధ్యమనే చెప్పాలి. ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్రజా బలం ఉన్న వారిని ఓడించడం జరిగే పని కాదు. నిత్యం ప్రజల్లో ఉంటూ, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసే టి‌డి‌పి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకు ప్రజా బలం ఎంత ఉందో చెప్పాల్సిన పని లేదు. నిత్యం సామాన్యుడు మాదిరిగా పాలకొల్లులో ప్రజలాతో మమేకమవుతూ తిరిగే నిమ్మలకు ప్రజా మద్ధతు ఎక్కువే. అందుకే గత ఎన్నికల్లో జగన్ గాలి ఓ వైపు..మరో వైపు జనసేన ఓట్లు చీల్చిన సరే నిమ్మల మళ్ళీ గెలిచారు.

ఇక అలాంటి నేతకు చెక్ పెట్టడానికి వైసీపీ నానా తిప్పలు పడుతుంది. అభ్యర్ధుల మీద అభ్యర్ధులని మారుస్తుంది. గత ఎన్నికల్లోనే టి‌డి‌పి నుంచి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాబ్జీని వైసీపీలోకి తీసుకుని నిలబెట్టారు. అయినా సరే నిమ్మలకు చెక్ పెట్టలేకపోయారు. తర్వాత పక్కనే ఉన్న భీమవరం నుంచి కవురు శ్రీనివాస్‌ని తీసుకొచ్చి..ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి, జెడ్పీ ఛైర్మన్ చేసి..పాలకొల్లులో పెత్తనం ఇచ్చారు. అయినా సరే నిమ్మల బలం తగ్గించలేకపోయారు.

దీంతో ఈ సారి కవురుని సైడ్ చేసి మరొక నేతకు ఛాన్స్ ఇవ్వాలని వైసీపీ చూస్తుందట.  భీమవరంలోని వీరవాసరం మండలానికి చెందిన గుడాల గోపీని కన్వీనర్‌గా నియమిస్తారని ప్రచారం ఊపందుకుంది. అయితే గోపి ఇప్పటిదాకా క్రియాశీల రాజకీయాల్లో లేరు. ఆయన ఆక్వా వ్యాపారి. ఆర్థిక బలం ఉండడం, శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో..పాలకొల్లులో వైసీపీకి ఊపు తెస్తారని భావిస్తున్నారట.

అయితే పాలకొల్లులో ఇప్పటికే తాతాజీ, గుణ్ణం నాగబాబు, మేకా శేషుబాబు వంటి సీనియర్లు ఉన్నారు. వారిని కాదని పక్క నియోజకవర్గం నుంచి నేతలని తీసుకురావడంపై పాలకొల్లు వైసీపీ శ్రేణులు సీరియస్ గా ఉన్నాయి. ఇక ఎంతమందిని మార్చిన ప్రజా బలమున్న నిమ్మలని ఓడించడం అసాధ్యమని అంటున్నారు.