రాజంపేటలో వైసీపీకి రివర్స్ షాక్..టీడీపీకి కలిసొస్తుందా?

కడప అంటే వైసీపీ కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అక్కడ వైసీపీ ఆధిక్యం ఎక్కువ ఉంటుంది. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాల్లో 10 సీట్లు ఉంటే 10 సీట్లు వైసీపీనే గెలుచుకుంది. ఇక అలాంటి కడపపై పట్టు సాధించేందుకు టి‌డి‌పి గట్టిగానే కష్టపడుతుంది. అయితే రానున్న ఎన్నికల్లో ఇక్కడ టి‌డి‌పి రెండు, మూడు సీట్లు గెలుచుకున్న గొప్పే..వైసీపీకి చెక్ పెట్టినట్లే.

అయితే ఇప్పుడు టి‌డి‌పి…అదే దిశగా వెళుతుంది. అక్కడ రెండు, మూడు సీట్లలో టి‌డి‌పికి ఆధిక్యం కనిపిస్తుంది. రాజంపేట, ప్రొద్దుటూరు, మైదుకూరు లాంటి సీట్లలో టి‌డి‌పికి పట్టు కనిపిస్తుంది. ఇక ఇందులో రాజంపేటలో వైసీపీని మరింత దెబ్బకొట్టేలా టి‌డి‌పి ముందుకెళుతుంది. తాజాగా రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్  రెడ్డి సోదరుడు విజయ్ శేఖర్ రెడ్డి..చంద్రబాబుని కలిశారు.

చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఆదేశిస్తే టీడీపీ టికెట్‌పై రాజంపేటలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని,  రాజంపేటకు కొత్త నాయకత్వం కావాలి అని, జిల్లాల ఏర్పాటు సమయంలో జిల్లా కేంద్రంగా రాజంపేటను ఎంపిక చేయకుండా అన్యాయం చేశారని, ఈ అన్యాయంలో తన సోదరుడు, ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి పాత్ర కూడా ఉందని చెప్పుకొచ్చారు. అయితే ఆల్రెడీ రాజంపేట టి‌డి‌పి ఇంచార్జ్ గా బత్యాల చెంగల్రాయుడు ఉన్నారు. ఇక 2014లో రాజంపేటలో టి‌డి‌పి నుంచి మేడా ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల ముందు వైసీపీలోకి వెళ్ళి గెలిచారు.

టి‌డిపి నుంచి చెంగల్రాయుడు పోటీ చేసి ఓడిపోయారు. నెక్స్ట్ ఎన్నికల్లో ఆయనే పోటీ చేయాలని చూస్తున్నారు. కానీ ఇప్పుడు మేడా సోదరుడు టి‌డి‌పిలోకి వచ్చి సీటు ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో రాజంపేట సీటు ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఎవరికి దక్కిన నేతలంతా కలిసికట్టుగా పనిచేస్తే గెలుస్తారు.