ఎన్డీయే వర్సెస్ ఇండియా..ఆట మొదలు.!

రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయమే కాదు..ఇప్పుడు దేశ రాజకీయాలు కూడా వాడివేడిగా సాగుతున్నాయి. నెక్స్ట్ లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకోవడానికి ఇప్పటినుంచే అధికార, విపక్షాలు ప్లాన్ చేస్తున్నాయి. అయితే మూడోసారి అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టాలని మోదీ నేతృత్వంలోని బి‌జే‌పి చూస్తుంది. కానీ గత రెండు ఎన్నికల మాదిరిగా ఈసారి గెలుపు అనేది సులువు కాదు. బి‌జే‌పి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ దాటడం అనేది కాస్త కష్టం. అందుకే బి‌జే‌పి..తమ పాత, కొత్త మిత్రపక్షాలతో సమావేశం పెట్టుకుంది.

అయితే ఇప్పటికే కాంగ్రెస్ సహ పలు విపక్షాలు కలిసి పాట్నాలో సమావేశమయ్యాయి. కేంద్రంలో బి‌జే‌పికి చెక్ పెట్టడమే లక్ష్యంగా ప్రణాళికలు రచించాయి. కాంగ్రెస్, టి‌ఎం‌సి, ఎన్‌సి‌పి, డి‌ఎం‌కే, ఆప్, ఎస్‌పి, జే‌డి‌యూ, ఆర్‌జే‌డి, కమ్యూనిస్టులు ఇంకా పలు పార్టీలు కలిసి ఐక్య కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. ఒక ఒకే రోజు ఇటు విపక్షాల మీటింగ్, అటు ఎన్డీయే పక్షాల మీటింగ్ జరిగింది. విపక్షాల మీటింగ్ బెంగళూరులో జరగగా, ఎన్డీయే మీటింగ్ ఢిల్లీలో జరిగింది.

ఇక విపక్షాలు తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టుకున్నాయి. ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంట్ ఇన్‌క్లూజివ్ అలయెన్స్(ఐ‌ఎన్‌డి‌ఐ‌ఏ-ఇండియా) అని పేరు పెట్టారు. ఈ కూటమి పలు నిర్ణయాలు తీసుకుంది. ఎన్డీయేని ఓడించడానికి ప్రధాని పదవిని సైతం కాంగ్రెస్ త్యాగం చేసింది. బీజేపీ ఓటమే లక్ష్యంగా 11 మందితో సమన్వయ కమిటీని నియమించారు.

అటు విపక్ష కూటమికి పోటీగా బి‌జే‌పి నేతృత్వంలో ఎన్డీయే కూటమి మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి 38 పార్టీలు హాజరయ్యాయి. ఏపీ నుంచి జనసేన ఈ సమావేశంలో పాల్గొంది. 50 శాతం ఓట్లతో తామే అధికారంలోకి వస్తామని, విపక్ష కూటమి ఓ కుటుంబ కూటమి అని, అవినీతి పరులు అందులో ఉన్నారని మోదీ విమర్శలు చేశారు. ఇటు ఎన్డీయే..అటు ఇండియా కూటములు హోరాహోరీగా తలపడనున్నాయి.