బీసీ-ఎస్సీ-ఎస్టీ..లోకేష్ గురి గట్టిగానే ఉంది.!

వచ్చే ఎన్నికల్లో టి‌డి‌పికి గెలుపు అనేది చాలా ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సారి గెలవకపోతే టి‌డి‌పి మనుగడకే ప్రమాదం..అందుకే అటు చంద్రబాబు, ఇటు నారా లోకేష్ పార్టీ కోసం గట్టిగా కష్టపడుతున్నారు. లోకేష్ పాదయాత్రతో ప్రజల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చంద్రబాబు పార్టీని బలోపేతం చేయడం కోసం గట్టిగానే కష్టపడుతున్నారు. ఇక బాబుకు తోడుగా ఓ వైపు పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూనే..పార్టీ బలోపేతం కోసం లోకేష్ సైతం పాటుపడుతున్నారు.

ఇక రాష్ట్రంలో అత్యధికంగా ఉంటూ గెలుపోటములని ప్రభావితం చేసే..బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలపైనే ఎక్కువ ఫోకస్ చేసి..వారి మద్ధతు టి‌డి‌పికి దక్కేలా లోకేష్ ముందుకెళుతున్నారు. ఎక్కడకక్కడ సామాజికవర్గాల వారీగా లోకేష్ సమావేశమవుతూ వారి సమస్యలని తెలుసుకుంటూ..వాటి పరిష్కారం కోసం పలు హామీలు ఇస్తూ అండగా నిలబడుతున్నారు. ఇప్పటికే పలు రకాల వర్గాల ప్రజలతో లోకేష్ భేటీ అయ్యారు. తాజాగా  ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో లోకేశ్‌ పాదయాత్ర కొనసాగించారు. ఆ సందర్భంగా  మూలెపాడు గ్రామంలో పాడి రైతులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. పాడి రైతులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు.

రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం ఆపేసిన సబ్సిడీ పథకాలను పునరుద్ధరిస్తామని, మినీ గోకులాలు నిర్మిస్తామని, మూతపడ్డ సహకార డెయిరీలను, పాలపొడి ఫ్యాక్టరీలను తెరిపించి పాడి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇక లోకేష్‌కు హారతి ఇచ్చారని ఓ బీసీ కార్యకర్త దుకాణాన్ని వైసీపీ నేతలు కూల్చివేశారు. దీంతో బాధితుడు లోకేష్‌కు మొర పెట్టుకోగా, ఎస్సీ, ఎస్టీ, బీసీల ఓట్లతో అధికారం చేపట్టిన జగన్‌ ఆ వర్గాలపై ఉక్కుపాదం మోపుతున్నారని, ఏ బీసీలనైతే జగన్ అణచివేస్తున్నారో.. వారే అరాచక ప్రభుత్వానికి ఘోరీ కట్టబోతున్నారని మండిపడ్డారు. అలాగే బాధితుడు కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందని అన్నారు. మొత్తానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓట్లపై లోకేష్ ఎక్కువ గురి పెట్టారు.