జంపింగులకు సీటు ఫిక్స్..కేసీఆర్ ప్లాన్ ఇదే.!

తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడిపోయింది..మరో రెండు నెలల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. నవంబర్ చివరిలో గాని, డిసెంబర్ మొదట్లో గాని ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎన్నికల్లో మళ్ళీ గెలిచి అధికారం చేపట్టాలని కే‌సి‌ఆర్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కే‌సి‌ఆర్ పక్కా వ్యూహాలతో ముందుకెళుతున్నారు. అయితే ముందే ఆయన ఎమ్మెల్యే అభ్యర్ధులని ఫిక్స్ చేస్తారని సమాచారం.

ఇప్పటికే అభ్యర్ధులని ఖరారు చేశారని, ఆగష్టులో మొదట లిస్ట్ విడుదల చేశారని తెలిసింది. అధిక శ్రావణం ముగిశాక..అసలైన శ్రావణ మాసంలో మెజారిటీ అభ్యర్ధుల లిస్టుని కే‌సి‌ఆర్ విడుదల చేస్తారని తెలిసింది. వ్యక్తిగతంగా ఎమ్మెల్యే పనితీరు బాగోని వారిని, నియోజకవర్గంలో కార్యకర్తలని, నేతలని పట్టించుకోని, ప్రజా వ్యతిరేకత ఉన్నవారిని పక్కన పెట్టి మిగతా వారికి సీట్లు ఫిక్స్ చేస్తారని సమాచారం. ప్రస్తుతం బి‌ఆర్‌ఎస్‌కు 103 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న చనిపోయారు. అక్కడ ఉపఎన్నిక రాలేదు. డైరక్ట్ ఎన్నికలే. ఇక కాంగ్రెస్‌కు 5, ఎం‌ఐ‌ఎంకి 7, బి‌జే‌పికి 3 గురు ఎమ్మెల్యేలు ఉన్నారు.

దాదాపు 70 వరకు ఎమ్మెల్యే అభ్యర్ధులని ప్రకటిస్తారని తెలిసింది. ఇక కాంగ్రెస్ నుంచి బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చిన జంపింగ్ ఎమ్మెల్యేలకు దాదాపు సీట్లు ఫిక్స్ అని తెలుస్తుంది. కాంగ్రెస్ నుంచి 12, టి‌డి‌పి 2, ఇండిపెండెంట్లు ఇద్దరు బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చారు. వారిలో దాదాపు అందరికీ సీట్లు ఖాయమే. ఇక ఆయా స్థానాల్లో ఉన్న బి‌ఆర్‌ఎస్ నేతలు ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. కాంగ్రెస్ లేదా బి‌జే‌పిలోకి వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే కొందరు కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. మరికొందరు రెడీ అయ్యారు. ఇక కే‌సి‌ఆర్ లిస్టుని ప్రకటించాక ఇంకా మార్పులు జరిగే ఛాన్స్ ఉంది.