కుప్పంలో శ్రీకాంత్ దూకుడు..లక్ష రీచ్ అవుతారా?

కుప్పంని సొంతం చేసుకోవాలని వైసీపీ ఎన్ని రకాలుగా రాజకీయం చేస్తుందో చెప్పాల్సిన పని లేదు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పంపై వైసీపీ ఫోకస్ పెట్టింది. అధికార బలాన్ని ఉపయోగించుకుని అక్కడ బలపడాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో లోకల్ ఎన్నికల్లో గెలిచింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంలోనే తిష్ట వేసి..వైసీపీని బలోపేతం చేస్తున్నారు.

ఇటు చంద్రబాబు కూడా దూకుడు పెంచారు. కుప్పంలో వైసీపీకి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా చేయాలని చూస్తున్నారు. వైసీపీ చేస్తున్న రాజకీయానికి ధీటుగా ఈ సారి లక్ష మెజారిటీతో గెలవడమే టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈ క్రమంలో తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ని కుప్పం ఇంచార్జ్ గా పెట్టిన విషయం తెలిసిందే. ఇక శ్రీకాంత్ తనదైన శైలిలో కుప్పంలో టి‌డి‌పి బలాన్ని పెంచేలా ముందుకెళుతున్నారు. వైసీపీకి ధీటుగా రాజకీయం చేస్తున్నారు. ఇటీవల పెద్దిరెడ్డి..చంద్రబాబు కుప్పంకు అద్దె నాయకుడుని తెచ్చారని విమర్శించారు. ఇక అంతా ధీటుగా శ్రీకాంత్ కౌంటర్ ఇచ్చారు.

పుంగనూరుకు చెందిన పెద్దిరెడ్డికి కుప్పంలో ఏం పని అని, అసలు పెద్దిరెడ్డి అద్దె నాయకుడు అని..తాను మూడు జిల్లాల ఎమ్మెల్సీని అని..అందులో కుప్పం నియోజకవర్గం ఉందని, కుప్పం గ్రాడ్యుయేట్లు తనకు ఓటు వేశారని కౌంటర్ ఇచ్చారు. అలాగే ఎమ్మెల్సీగా ప్రోటోకాల్ ప్రకారం కుప్పంని ఎంచుకున్నానని, అలాగే కుప్పం మున్సిపాలిటీ ఎక్స్‌అఫిషియో మెంబర్‌ని అని ఆ విషయం కూడా పెద్దిరెడ్డికి తెలియదని  అన్నారు.

ఇలా శ్రీకాంత్..పెద్దిరెడ్డికి ధీటుగా కౌంటర్లు ఇస్తున్నారు. ఇక కుప్పంలో చంద్రబాబుకు లక్ష మెజారిటీ తీసుకురావడమే టార్గెట్ గా ఆయన పనిచేస్తున్నారు. తాజాగా కుప్పంలో చంద్రబాబు ఇంటి నిర్మాణానికి పర్మిషన్ కూడా వచ్చింది. తాజాగా ఇంటికి శంఖుస్థాపన చేశారు. మొత్తానికైతే కుప్పంలో శ్రీకాంత్ దూకుడుగా పనిచేస్తున్నారు. మరి బాబుకు లక్ష మెజారిటీ తీసుకొస్తారో లేదో చూడాలి.