కుప్పం కూడా బైబై బాబు అంటుందా? జరిగే పనేనా?

వైసీపీ అధికారంలోకి వచ్చాక…టి‌డి‌పి కంచుకోటలని ఇంకా కుప్పకూల్చడమే లక్ష్యంగా రాజకీయం నడుపుతున్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లోనే చాలా వరకు టి‌డి‌పి కంచుకోటలని కైవసం చేసుకున్నారు. ఇక 2024లో క్లీన్ స్వీప్ చేసేయాలని జగన్ చూస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు కంచుకోట కుప్పంపై జగన్ ఏ విధంగా ఫోకస్ పెట్టారో తెలిసిందే. అక్కడ బాబుకు చెక్ పెట్టే విధంగా రాజకీయం మొదలుపెట్టారు.

అధికార బలాన్ని వాడుకుని..పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో గెలిచారు. కుప్పం మున్సిపాలిటీని గెలుచుకున్నారు. దీంతో కుప్పం అసెంబ్లీని సైతం గెలుచుకుంటామని వైసీపీ నేతలు అంటున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడే పాగా వేసి…వైసీపీని గెలిపించాలని చూస్తున్నారు. కానీ వైసీపీ ఎత్తులకు బాబు కూడా చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడ కూడా వైసీపీకి అవకాశం ఇవ్వకూడదని చూస్తున్నారు. వీలు దొరికినప్పుడల్లా కుప్పంకు వెళుతున్నారు. పార్టీని బలోపేతం చేసుకుంటున్నారు.

అయితే తాజాగా చిత్తూరులో పర్యటించిన జగన్..ఇక కుప్పం ప్రజలు కూడా బై బై బాబు అంటున్నారని, చిత్తూరుకు బాబు ద్రోహం చేశారని ఫైర్ అయ్యారు. దీని బట్టి చూస్తే కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారనేది జగన్ చెబుతున్నారు. మరి అది ఈజీగా జరుగుతుందా? అంటే ఏ మాత్రం జరగదనే సర్వేలు చెబుతున్నాయి. ఎందుకంటే కుప్పంలో ఇప్పటికీ బాబు బలంగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే గత ఎన్నికల కంటే ఇప్పుడు స్ట్రాంగ్ అయ్యారు.

గత ఎన్నికల్లో 30 వేల మెజారిటీ మాత్రమే వచ్చింది. ఇప్పుడు అది మరింత పెరిగిందని తెలుస్తుంది. అయితే వైసీపీ చేసే రాజకీయాలు బాబుకు ప్లస్ అయ్యాయి. బాబుపై ఇంకా సానుభూతి పెరిగింది. దీంతో కుప్పంలో వైసీపీ ఎన్ని చేసిన బై బై బాబు చెప్పడం కష్టమే.