‘మహిళ’తోనే గెలుపు..బాబు పక్కా ప్లాన్.!

నెక్స్ట్ ఎన్నికల్లో గెలుపు అనేది టి‌డి‌పికి చాలా ముఖ్యం. ఈ సారి ఎన్నికల్లో గాని గెలవకపోతే టి‌డి‌పి భవిష్యత్తుకే ప్రమాదం. అందులో ఎలాంటి డౌట్ లేదు. అందుకే ఈ సారి పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం చంద్రబాబు గట్టిగానే కష్టపడుతున్నారు. ఓ వైపు వైసీపీపై పోరాడుతూనే..మరోవైపు టి‌డి‌పిని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. అయితే నెక్స్ట్ గెలవడానికి ఇప్పటికే మినీ మేనిఫెస్టో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆరు హామీలతో సూపర్ సిక్స్ అనే కార్యక్రమం తీసుకొచ్చారు.

ఇప్పటికే మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్ళెలా టి‌డి‌పి నేతలు బస్సు యాత్ర చేసిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో సూపర్ సిక్స్ లో ఒకటిగా ఉన్న మహాశక్తి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు తాజాగా చంద్రబాబు మహాశక్తి చైతన్య రథయాత్రని ప్రారంభించారు. మహాశక్తిలోని కార్యక్రమాలని ప్రతి మహిళకు అర్ధమయ్యేలా చెప్పేలా ప్లాన్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా నేతలు ప్రచారం చేయనున్నారు. ఈ మహాశక్తి ద్వారా మహిళా ఓట్లని దక్కించుకోవడమే బాబు టార్గెట్.  మహిళలు తలుచుకుంటే ప్రభుత్వాలే మారిపోతాయి.

గత ఎన్నికల్లో మహిళలు మెజారిటీ గా జగన్ వైపు నిలబడ్డారు. దీని వల్ల వైసీపీ విజయం సాధ్యమైంది. ఇప్పుడు ఆ మహిలలని మెజారిటీ సంఖ్యలో తమవైపు తిప్పుకోవాలని టి‌డి‌పి చూస్తుంది. అందుకే మహాశక్తి కార్యక్రమంలో…టి‌డి‌పి అధికారంలోకి వస్తే మహిళలకు జిల్లా పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం. 18 ఏళ్ళు దాటిన మహిళలకు నెలకు రూ.1500..అంటే 60 ఏళ్ల లోపు వరకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. 60 ఏళ్ళు పైబడిన వారికి పెన్షన్ ఎలాగో వస్తుంది.

అలాగే తల్లికి వందనం పేరిట..ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే..అంతమందికి ఏడాదికి రూ.15 వేలు ఇవ్వనున్నారు. ఒకవేళ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే రూ.30 వేలు ఇస్తారు. ఇలా నాలుగు పథకాలు మహిళల కోసం తీసుకొచ్చారు. మరి ఈ పథకాలు మహిళా ఓటర్లని ఎంతవరకు టి‌డి‌పి వైపు తిప్పుతాయో చూడాలి.