వైసీపీకి భారీ దెబ్బ..టీడీపీలోకి డిప్యూటీ సీఎం వారసుడు..?

ఏపీలో అధికార వైసీపీకి ఊహించని షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీలో సరైన ప్రాధాన్యత లేకపోవడం…నెక్స్ట్ అధికారం దక్కుతుందో లేదో క్లారిటీ లేకపోవడం…ఇటు  టి‌డి‌పి బలపడుతున్న నేపథ్యంలో పలువురు నేతలు..పార్టీ మారిపోతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు టి‌డి‌పిలోకి వచ్చేశారు. ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు టి‌డి‌పి వైపుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇంకా పలువురు ఎమ్మెల్యేలు కూడా లైన్ లోనే ఉన్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు కుమారుడు బూడి రవి టి‌డి‌పిలోకి వస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవల రవి అనూహ్యంగా చంద్రబాబుతో భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు ఈ భేటీ గురించి మీడియాలో పెద్ద హైలైట్ కాలేదు. కానీ తాజాగా రవి..బాబుని కలిసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో రవి టి‌డి‌పిలోకి వస్తున్నారనే ప్రచారం మొదలైంది. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా మాడుగుల నుంచి గెలిచిన బూడి ముత్యాలనాయుడుకు..రెండో విడతలో మంత్రి పదవి దక్కింది. అలాగే డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ వచ్చింది.

అయితే అధికారంలోకి వచ్చాక…బూడి తన మొదట భార్య కుమారుడైన రవిని పట్టించుకోవడం లేదని తెలిసింది. పెద్దగా ప్రాధాన్యత కూడా ఇవ్వడం లేదని తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రవి జెడ్పీటీసీ సభ్యుడిగా నామినేషన్ వేశారు. కానీ చివరి నిమిషంలో రవిని తప్పించి…బూడి రెండో భార్య కుమార్తె అనురాధను ఆ స్థానంలో నిలబెట్టి గెలిపించారు. ఇక ఇప్పటికీ అనురాధకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, తనని పట్టించుకోలేదని సన్నిహితుల వద్ద రవి ఆవేదన చెందుతున్నట్లు తెలిసింది.

ఈ క్రమంలోనే ఆ మధ్య చంద్రబాబు విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు టి‌డి‌పి నాయకురాలు కోళ్ళ లలితకుమారి ఇంటి వద్ద రవి..బాబుని కలిశారు. ఇప్పుడు ఆ ఫోటో బయటపడటంతో రవి టి‌డి‌పిలోకి వచ్చేస్తున్నారని, మాడుగుల సీటు అడుగుతున్నారని ప్రచారం వస్తుంది. చూడాలి మరి రవి టి‌డి‌పిలోకి వచ్చి..పోటీ చేస్తారో లేదో.