పవన్‌కు పొత్తు సెట్ కాదా? వైసీపీ గేమ్.?

టీడీపీ-జనసేన పొత్తు ఉండకూడదని చెప్పి వైసీపీ గట్టిగానే ట్రై చేస్తుంది. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటే తమకు ఇబ్బంది అనే సంగతి వైసీపీ గ్రహించింది. గత ఎన్నికల్లో రెండు పార్టీలు విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి మేలు జరిగింది. ఇప్పుడు అదే విధంగా రెండు పార్టీలు వేరు వేరుగా పోటీ చేస్తే ఓట్లు చీలి తమకు లబ్ది జరుగుతుందనేది వైసీపీ భావన.

కానీ టి‌డి‌పి, జనసేన కలిసి పోటీ చేసే దిశగానే ముందుకెళుతున్నాయి. దీంతో వైసీపీలో టెన్షన్ పెరిగింది. అందుకే ఏదొక విధంగా పొత్తు చెడగొట్టాలనే దిశగా వైసీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మంత్రి కొట్టు సత్యనారాయణ పొత్తుపై కామెంట్స్ చేశారు.  పవన్‌ కల్యాణ్‌కు దుష్టశక్తులతో పొత్తు, సహవాసం మంచిది కాదని, పవన్‌కల్యాణ్‌ను అందలంపై చూడాలని కాపులు కోరుకోవడం వాస్తవమని, కానీ అతను టీడీపీతో పొత్తు పెట్టుకుని, చంద్రబాబు సీఎం కావాలని కోరుకుంటూ, చేవ చచ్చిన నిర్ణయం తీసుకున్నాడని అన్నారు.

చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటున్న పవన్‌కల్యాణ్‌ ఈసారి నిండా మునగడం ఖాయమని,  మా దేవుడు వంగవీటి మోహన్‌ రంగాను హత్య చేయించిన వారితో చేతులు కలపడాన్ని కాపులు సహించలేకపోతున్నారని, అందుకే తన బాధ్యతగా చెప్తున్నా.. సొంతంగా పోటీ చేయాలని సూచిస్తున్నానని,  రంగా కుమారుడు రాధా టీడీపీవైపే ఉన్నారని ఓ విలేకరి ప్రస్తావించగా.. కుర్రోడు కదా.. వయసొచ్చాక తెలుసుకుంటాడు అని అన్నారు.

అయితే పవన్ ఒంటరిగా పోటీ చేస్తే ఓట్లు చీలి మళ్ళీ తమకు లబ్ది జరుగుతుందనే కాన్సెప్ట్ లోనే వైసీపీ నేతలు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక టి‌డి‌పి, జనసేన పొత్తు ఉంటే మొదట నష్టపోయేది మంత్రి కొట్టు సత్యనారాయణ. గత ఎన్నికల్లో ఓట్లు చీలడం వల్లే తాడేపల్లిగూడెంలో కొట్టు గెలిచారు. ఈ సారి టి‌డి‌పి, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి..దీంతో కొట్టు గెలవడం కష్టమే.