తండ్రుల క్యారెక్టర్స్‌లో ఒదిగిపోయే టాప్ తెలుగు నటులు వీరే..

చాలా సినిమాల్లో హీరో, హీరోయిన్ పాత్రలతో పాటు వారి స్నేహితుల పాత్రలు కూడా బాగా ఫేమస్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా హీరో, హీరోయిన్ తండ్రుల పాత్రలు కూడా ప్రేక్షకులపై ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. కొన్ని తండ్రి పాత్రలు అయితే ప్రేక్షకులు మనసులో చిరకాలం అలా నిలిచిపోతాయి. తెలుగు పరిశ్రమలోని సినిమాల్లో తండ్రి పాత్రలో జీవించిన కొంతమంది నటుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

• మురళిధర్ గౌడ్

విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన డీజే టిల్లు సినిమాలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించాడు. ఈ సినిమాలోని టిల్లు ఫాదర్ పాత్రలో మురళీధర్ గౌడ్ అద్భుతంగా నటించాడు. మురళీధర్ ఇదివరకే కొన్ని షార్ట్ ఫిలిమ్స్, సినిమాలలో నటించాడు. డీజే టిల్లు సినిమాలో కొడుకు చేసే పనులు నచ్చని తండ్రిగా అద్భుతంగా నటించి ప్రేక్షకులను అలరించాడు మురళీధర్. ఇక ‘బలగం ‘ సినిమాలో హీరోయిన్ తండ్రిగా నటించి మెప్పించాడు. ఎక్కువ సినిమాలలో అవకాశం రాకపోయినప్పటికీ డీజే టిల్లు, బలగం లాంటి మంచి సినిమాలలో ఇతడు భాగమయ్యాడు. ప్రస్తుతం మురళీధర్ దాస్ క ధమ్కి, పరేషాన్ సినిమాలలో హీరో తండ్రిగా నటించాడు.

• రాజీవ్ కనకాల

నటుడు రాజీవ్ కనకాల ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతాడు. ఇప్పుడు వయసు పై పడటంతో ఎక్కువగా తండ్రి పాత్రలో నటిస్తున్నాడు. విరూపక్షాలో గ్రామ సర్పంచ్ గా, హీరోయిన్ తండ్రిగా రాజీవ్ అద్భుతంగా నటించాడు. అలానే హాట్ స్టార్ లో మే లో విడుదల అయిన ‘డెడ్ పిక్సెల్స్’ అనే వెబ్‌సిరీస్‌లో ఒక ప్రధాన పాత్రదారికి తండ్రిగా నటించాడు. ఈ సిరీస్‌లో కొడుకుని ఒక గొప్ప క్రీడాకారుడిగా చూసే తండ్రిగా అద్భుతంగా నటించాడు.

• ప్రకాష్ రాజ్

క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కెరీర్ ప్రారంభం నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడు పలు భాషలలో ఎన్నో తండ్రి పాత్రలలో నటించాడు. బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దాంటానా, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఆకాశమంతా ఇలా ఎన్నో సినిమాలలో తండ్రి పాత్ర పోషించి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు.

• నరేష్

ఒకప్పుడు హీరోగా నటించి, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యాడు నరేష్. నరేష్ ఎక్కువగా తండ్రి పాత్రలలోనే నటిస్తుంటాడు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన రంగరంగ వైభవంగా, హీరో, అంటే సుందరానికి సినిమాలతో పాటుగా గతంలో వరుడు, చిన్నదాన నీకోసం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, భలే భలే మగాడివోయ్ లాంటి ఎన్నో సినిమాలో హీరోయిన్ లేదా హీరో పత్రాలకు తండ్రిగా నటించి ప్రేక్షకులను అలరించాడు.