వెస్ట్‌లో ఐదు సీట్లపై పవన్ ఫోకస్..టీడీపీతో స్వీప్ ప్లాన్.!

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. తూర్పు గోదావరిలో యాత్ర ముగించుకుని..పశ్చిమలోని నరసాపురంలో ఎంట్రీ ఇచ్చారు. ఇక తూర్పులో యాత్రకు భారీ స్థాయిలో జన సందోహం తరలివచ్చిన విషయం తెలిసిందేల. తాజాగా నరసాపురంలో జరిగిన సభకు సైతం భారీగా జనం వచ్చారు.

ఇక యథావిధిగా జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడిన పవన్…జనసేన ప్రభుత్వం వస్తే గోదావరి జిల్లాలని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో రాజకీయంగా గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు రాకుండా చేస్తానని అన్నారు. అయితే టి‌డి‌పితో కలిస్తేనే వైసీపీని ఓడించడం సాధ్యమవుతుంది. ఇదే సమయంలో వెస్ట్ లో క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. 2014లో టి‌డి‌పికి జనసేన మద్ధతు ఇవ్వడం వల్ల స్వీప్ చేసేసింది. జిల్లాలో 15 సీట్లు ఉంటే టి‌డి‌పి 14, పొత్తులో భాగంగా బి‌జే‌పి ఒక సీటు గెలుచుకుంది.

గత ఎన్నికల్లో రెండు పార్టీలు వేరు వేరుగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి మేలు జరిగింది. కానీ ఈ సారి ఆ పరిస్తితి రాకూడదని టి‌డి‌పి, జనసేన కలిసి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాయి. రెండు పార్టీలు కలిస్తే వెస్ట్ లో స్వీప్ చేసే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో సీట్ల పంపకాల విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. జిల్లాలో దాదాపు అన్నీ సీట్లలో టి‌డి‌పి బలంగానే ఉంది.

జనసేన నరసాపురం, తాడేపల్లిగూడెం, భీమవరం సీట్లలో బలంగా ఉంది. ఈ మూడింటితో పాటు మరో రెండు సీట్లు తీసుకోవాలని జనసేన చూస్తుంది. చూడాలి మరి టి‌డి‌పి, జనసేన కలిసి పోటీ చేస్తే వెస్ట్ లో స్వీప్ చేయగలవో లేదో.