మైదుకూరులో సైకిల్ జోరు..కడపలో గెలుచుకునే ఫస్ట్ సీటు.?

జగన్ సొంత జిల్లా కడపలో తెలుగుదేశం పార్టీ నిదానంగా పికప్ అవుతుంది. ఇంతకాలం అక్కడ టి‌డి‌పికి పెద్ద పట్టు లేదు..కానీ ఇప్పటివరకు కాంగ్రెస్, వైసీపీలని గెలిపిస్తూ వస్తున్న కడప ప్రజల్లో మార్పు కనిపిస్తుంది. ఎన్నో ఏళ్లుగా గెలుపుకు దూరమైన టి‌డి‌పి వైపు ప్రజలు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో జిల్లాలో లోకేశ్ పాదయాత్ర టి‌డి‌పికి ఊపు తెస్తుంది.

జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో సక్సెస్ అయిన పాదయాత్ర..మైదుకూరులో ఊహించని స్థాయిలో విజయవంతమైంది. లోకేశ్ సభకు భారీ ఎత్తున జనం వచ్చారు. దీంతో మైదుకూరులో సీన్ మారుతుందని తెలుస్తుంది. మైదుకూరులో టి‌డి‌పి కేవలం రెండు సార్లు మాత్రమే గెలిచింది..1985, 1999 ఎన్నికల్లోనే గెలిచింది. ఆ తర్వాత ఎప్పుడు గెలవలేదు. 2004 నుంచి వరుసగా ఓడిపోతూ వస్తుంది. గత రెండు ఎన్నికల్లో వైసీపీ గెలుస్తూ వస్తుంది. వైసీపీ నుంచి శెట్టిపల్లి రఘురామిరెడ్డి గెలుస్తున్నారు. అయితే ఈయనపై ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది.

ఆ వ్యతిరేకత ఎలా ఉందో రెండేళ్ల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తేలింది. మైదుకూరు మున్సిపాలిటీలో 24 వార్డులు ఉంటే టి‌డి‌పి 12, వైసీపీ 11, జనసేన ఒక వార్డు గెలుచుకుంది. కాకపోతే ఎక్స్‌అఫిషియో ఓట్లతో మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంది. అయినా సరే ప్రజలు టి‌డి‌పి వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తుంది.

ఇదే సమయంలో ఇక్కడ టి‌డిపి నేత పుట్టా సుధాకర్ యాదవ్ అనూహ్యంగా పుంజుకున్నారు. గత రెండు ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి ఆయనపై ఉంది. గతంలో ఓడిన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేశారు. ఇపుడు ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు అండగా నిలబడుతున్నారు. దీంతో మైదుకూరులో టి‌డి‌పి అనూహ్యంగా పుంజుకుని ఆధిక్యంలోకి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ సైకిల్ హవా కొనసాగేలా ఉంది.