వారాహి రెడీ..జనసేనకు పట్టు చిక్కేనా.!

ప్రజల్లో రావడానికి పవన్ సిద్ధమయ్యారు. ఎన్నికల సమయం దగ్గరపడటంతో పవన్ వారాహితో ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. చాలాకాలంగా పవన్ ఏపీ రాజకీయాల్లో కనిపించలేదు. సినిమా షూటింగు ల్లో బిజీగా ఉండిపోయారు. అయితే ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో ఆయన ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో యాత్ర చేయనున్నారు. ప్రజలని కలవనున్నారు. 11 నియోజకవర్గాల్లో పవన్ బస్సు యాత్ర కొనసాగింది.

దీని ద్వారా ప్రజలని కలవడంతో..ఆయా స్థానాల్లో పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేయనున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి యాత్ర మొదలవుతుంది.  పిఠాపురం, కాకినాడ, కాకినాడ రూరల్‌, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు తర్వాత నరసాపురం, పాలకొల్లు, భీమవరం నియోజకవర్గాల్లో పవన్ టూర్ ఉంటుంది. అయితే ఇందులో ఒకటి, రెండు స్థానాలు మినహా మిగిలిన స్థానాల్లో జనసేనకు పట్టుంది. అలాగే టి‌డి‌పితో పొత్తు ఉంటుంది కాబట్టి..పొత్తులో భాగంగా ఈ సీట్లని జనసేన తీసుకునే ఛాన్స్ ఉంది.

ఒకటి, రెండు సీట్లు మినహా మిగిలిన సీట్లు జనసేనకు దక్కే ఛాన్స్ ఉంది. అయితే ఆయా సీట్లలో జనసేన గెలుపే లక్ష్యంగా పవన్ టూర్ సాగనుంది. ఈ సీట్లలో ప్రత్తిపాడు, పాలకొల్లు సీట్లు టి‌డి‌పివే. ఇక ముమ్మిడివరం, కాకినాడ సిటీ, రూరల్, పి.గన్నవరం సీట్లలో కాస్త కన్ఫ్యూజన్ ఉంది. మిగిలిన సీట్లు దాదాపు జనసేనకే దక్కే ఛాన్స్ ఉంది. ఇక పొత్తు ఉంటుంది కాబట్టి టి‌డి‌పి, జనసేన కలిసి ఈ 11 సీట్లలో గెలవడం ఖాయమని చెప్పవచ్చు.

గత ఎన్నికల్లో పాలకొల్లు మినహా మిగిలిన సీట్లలో టి‌డి‌పి, జనసేనల మధ్య ఓట్లు చీలడం వల్ల వైసీపీ గెలిచింది. అయితే ఈ సారి ఆ పరిస్తితి రాకుండా పవన్, చంద్రబాబు జాగ్రత్తపడుతున్నారు. మరి పవన్ వారాహి యాత్ర ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.