వారాహితో పవన్ రెడీ..జనసేన స్థానాలపైనే గురి.!

మొత్తానికి ఎన్నికల సమరంలోకి పవన్ కూడా దిగుతున్నారు. ఇంతకాలం ఆయన సినిమా షూటింగ్ ల్లో బిజీగా ఉండిపోయారు. కానీ ఇటు ఏపీలో జగన్, చంద్రబాబుల మధ్య రాజకీయ యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. అలాగే ఎన్నికల సమరానికి ఇద్దరు నేతలు రెడీ అయ్యారు. ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలియడంతో బాబు మరింత దూకుడుగా ఉంటూ..అభ్యర్ధులని సైతం ఖరారు చేసే పనిలో ఉన్నారు. అటు మేనిఫెస్టోని సైతం ప్రకటించిన విషయం తెలిసిందే.

అటు జగన్ భారీ సభలతో ప్రజల్లో ఉంటున్నారు. ఇలా ఇద్దరు నేతలు ఎన్నికల సమరంలో దిగారు. ఈ క్రమంలోనే పవన్ సైతం జూన్ 14 నుంచి రంగంలోకి దిగుతున్నారు.  అన్నవరం సత్యదేవుడి దర్శనం అనంతరం యాత్ర ప్రారంభిస్తారన్నారు. ఇక అన్నవరం నుంచి భీమవరం వరకు తొలివిడతగా 11 నియోజకవర్గాల్లో పవన్‌ యాత్ర సాగుతుందని నాదెండ్ల మనోహర్ చెప్పారు. ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి యాత్ర మొదలవుతుందని, పిఠాపురం, కాకినాడ, కాకినాడ రూరల్‌, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు తర్వాత నరసాపురం, పాలకొల్లు, భీమవరం నియోజకవర్గాల్లో యాత్ర ఉంటుందని చెప్పారు.

అయితే పవన్ తిరిగే నియోజకవర్గాలు దాదాపు పొత్తులో భాగంగా టి‌డి‌పిని అడుగుతున్న సీట్లే. వాటిల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, అమలాపురం, రాజోలు, ముమ్మిడివరం లాంటి సీట్లు జనసేనకు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇటు ప్రత్తిపాడు, పి.గన్నవరం సీట్లలో క్లారిటీ లేదు. అటు పశ్చిమ గోదావరిలో నరసాపురం, పాలకొల్లు, భీమవరం సీట్లలో పాలకొల్లు తప్ప..మిగిలిన రెండు సీట్లు జనసేనకే. మొత్తానికి తమకు దక్కే సీట్లలోనే పవన్ టూర్ పెట్టుకుంటున్నారు.