పవన్ గేమ్ స్టార్ట్..జగన్‌కు రిస్క్ షురూ!

జనసేన అధినేత పవన్ కల్యాణ్..ప్రజా వేదికలోకి వచ్చారు. ఎన్నికల సమయం దగ్గరపడటంతో ప్రజా క్షేత్రంలోకి వచ్చేశారు. ఇప్పటికే చాలారోజులు సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నారు. పైగా ఇటు చంద్రబాబు, జగన్ ప్రజల్లోనే ఉంటున్నారు. దీంతో పవన్ వెనుకబడ్డారు. దాన్ని కవర్ చేసుకునే దిశగా పవన్ రంగంలోకి దిగారు. వారాహితో ఎంట్రీ ఇచ్చారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అన్నావరం దేవాలయంలో పూజలు చేయించి..కత్తిపూడి రోడ్ షోలో పాల్గొన్నారు.

ఇక జగన్ ప్రభుత్వమే లక్ష్యంగా పవన్ విరుచుకుపడ్డారు. ఇటీవల కాలంలో జగన్ పదే పదే ప్రస్తావిస్తున్న క్లాస్ వార్..విమర్శలకు పెద్ద ఎత్తున కౌంటర్లు ఇచ్చారు.  వివేకానందరెడ్డి హత్య కేసులో అన్ని దారులూ సీఎం జగన్‌ ఇంటివైపే చూపిస్తుంటే ఎవరు పసివాడు అని,  నిన్ను పాపం పసివాడు అనాలా? ఎంత గొప్పవాళ్లనైనా ఎదురుగా కూర్చోబెట్టుకుని చేతులు కట్టుకునేలా చేసి పైశాచిక ఆనందం పొందున్న జగన్‌ పాపం పసివాడంట అని సెటైర్లు వేశారు.

ఇక మాట్లాడితే క్లాస్‌వార్‌ అంటూ జగన్‌ కబుర్లు చెబుతున్నారని, ప్రజలను విభజించి పాలిస్తూ కులాల మధ్య చిచ్చుపెడుతున్న వ్యక్తి అసలు క్లాస్‌వార్‌ నడుపుతున్నారని, ప్రజల వద్దకు వెళ్లి అమాయకపు నవ్వు నటిస్తూ చేయాల్సిదంతా చేస్తున్నారని, అధికారం అండతో కోట్ల అవినీతికి పాల్పడుతూ, ఫ్యూడలిస్టిక్‌ మనస్తత్వంతో వ్యవహరిస్తున్న జగన్‌ అసలైన క్లాస్‌వార్‌ నడుపుతున్నాడని ఫైర్ అయ్యారు.

నవంబరు లేదా డిసెంబరులో ఎన్నికలకు వెళ్లడానికి ఆయన అంతా సిద్ధం చేసుకుంటున్నారని, ఎన్నికల కమిషన్‌ను కూడా కలిసినట్లు ప్రచారం జరుగుతోందని అన్నారు. గత ఎన్నికల్లో రెండుచోట్ల పోటీచేయడం తనకు ఇష్టం లేదని, అయినా తనని ఓడించడానికి కక్ష కట్టారని, కానీ ఈ సారి తనని అసెంబ్లీలో అడుగుపెట్టకుండా ఆపలేరని,  ప్రజలిస్తే సీఎం పదవి స్వీకరిస్తానని అన్నారు. పొత్తులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అవి సమయం వచ్చినప్పుడు చూసుకుంటామని చెప్పారు. మొత్తానికి జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే కసితో పవన్ ఉన్నారు.