ఆ మంత్రికి సీటు తిప్పలు..కొత్త అభ్యర్ది రెడీ.!

వచ్చే ఎన్నికల్లో పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వనని జగన్ పలుమార్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తాజాగా కూడా గడపగడపకు సమీక్షా సమావేశంలో మరోసారి క్లారిటీ ఇచ్చారు. కొందరు పనితీరు బాగోలేదని వారికి సీటు ఇవ్వడం కష్టమని చెప్పారు. ఈ క్రమంలో కొందరు మంత్రులని సైతం సైడ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. ఈ క్రమంలోనే మంత్రి గుమ్మనూరు జయరాంకు సీటు విషయంలో ఇబ్బందులు ఉన్నాయి. ఈయన పనితీరు బాగోలేదని పలు సర్వేల్లో తేలింది.

పైగా ఈయన పై పలు ఆరోపణలు రావడంతో ఆలూరులో పోటీ చేస్తే గెలవరనే ప్రచారం వస్తుంది. ఈ క్రమంలోనే టి‌డి‌పికి చెందిన కప్పట్రాళ్ళ బొజ్జమ్మని వైసీపీలోకి తీసుకొచ్చారు. ఈమె గతంలో జెడ్‌పి‌టి‌సి గా పనిచేయగా, ఈమె భర్త రామచంద్రనాయుడు దేవనకొండ ఎంపీపీగా పనిచేశారు. అయితే ఎన్నో ఏళ్ల నుంచి వీరు టి‌డి‌పిలో పనిచేస్తున్నారు. కానీ 2019 ఎన్నికల్లో ఆలూరు టీడీపీ టికెట్‌ కోట్ల సుజాతమ్మకు ఇవ్వడంతో అప్పటి నుంచి వారు అసంతృప్తితో ఉన్నారు.

ఇక నెక్స్ట్ కూడా ఆలూరు టి‌డి‌పి సీటు సుజాతమ్మకే ఫిక్స్ అయింది. దీంతో వారు వైసీపీ వైపుకు వచ్చారు. వైసీపీలో మంత్రి జయరాం ఉన్నారు. ఆయన పనితీరు బాగోలేదని,ఈ సారి జయరాంని కర్నూలు ఎంపీగా పోటీ చేస్తారని తెలుస్తుంది. ఇప్పటికే జగన్..జయరాంని కర్నూలు చూసుకోవాలని, బొజ్జమ్మ ఆలూరు చూసుకుంటారని చెప్పారు. దీంతో ఆలూరు సీటు బొజ్జమ్మకే అని అంటున్నారు.

ఈ క్రమంలో జయరాం సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఫ్యాక్షన్‌కు దారితీసే నాయకులను నమ్మొద్దని,  ఎవరొచ్చినా ఫ్యాక్షన్‌ను రెచ్చగొట్టకుండా.. ఫ్యాక్షన్‌కు తావివ్వకుండా.. గలాటాలు లేకుండా ప్రేమతో రాజకీయం చేయాలని వైసీపీ శ్రేణులని కోరారు. బొజ్జమ్మ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకునే ఈ వ్యాఖ్యలు చేశారని తెలిసింది. అటు బొజ్జమ్మ ఆలూరులో పల్లె బాటకు సిద్ధమవుతున్నారు. మొత్తానికి మంత్రి సీటు ఎగిరేలా ఉంది.