టీడీపీలో ఎన్‌ఆర్‌ఐలకు షాక్..సీటు లేదట.!

ఎన్నికల సమయం దగ్గరపడటంతో టి‌డి‌పి నేతలు ఫుల్ యాక్టివ్ అయిన విషయం తెలిసిందే. అయితే గెలుపు అవకాశాలు మెరుగు పడుతుండటంతో గతంలో యాక్టివ్ గా లేని నేతలు సైతం ఇప్పుడు యాక్టివ్ అవుతున్నారు. ఇదే సమయంలో ఎన్‌ఆర్‌ఐలు సైతం రేసులోకి వచ్చారు. వారు సొంత నియోజకవర్గాలకు వెళ్ళి అక్కడ ట్రస్టులు ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు..భారీగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. పార్టీకి ఫండింగ్ కూడా భారీగానే ఇస్తున్నారు.

అయితే చాలామంది ఎన్‌ఆర్‌ఐలు సీటు ఆశించి ఇలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక వీరి వల్ల ఆయా స్థానాల్లో ముందు నుంచి పనిచేస్తున్న టి‌డి‌పి నేతలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఎన్‌ఆర్‌ఐలకు సీటు ఇవ్వవద్దని టి‌డి‌పి సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఫౌండేషన్లు, ట్రస్టుల పేరుతో వచ్చేవారిని దగ్గరకు రానివ్వొద్దని, ఈ నాలుగేళ్లూ వీళ్లు ఏమయ్యారు? అని, అక్కడో పది వేలు.. ఇక్కడో పది వేలు ఇచ్చి టికెట్లు కావాలంటే ఇచ్చేస్తారా? అని ప్రత్తిపాటి ప్రశ్నించారు.  ఇప్పుడేదో రూ.కోటి ఖర్చు పెట్టి ఎక్కడా లేని హడావుడి చేస్తారని, తర్వాత చేతులెత్తేస్తారని, ఎన్నికల్లో పోటీ చేయడమంటే మాటలా? వీరు ఎన్నికల ముందు వస్తారు… ఎన్నికలు అవగానే వెళ్లిపోతారని అన్నారు.

ఇక భాష్యం ప్రవీణ్‌ చిలకలూరిపేట టికెట్‌ అడుగుతున్నారని వస్తున్న వార్తలపై ప్రశ్నించగా.. ప్రవీణ్‌కు, చిలకలూరిపేటకు ఏం సంబంధమని ప్రత్తిపాటి ఫైర్ అయ్యారు. ప్రవీణ్ మాత్రమే కాదు..గుడివాడలో వెనిగండ్ల రాము, ఉదయగిరిలో కాకర్ల సురేష్, శృంగవరపుకోటలో గంప కృష్ణ, గుంటూరులో మన్నవ మోహనకృష్ణ..ఇలా కొందరు ఎన్‌ఆర్‌ఐలు టి‌డి‌పి సీటు ఆశిస్తున్నారు. మరి వీరికి చంద్రబాబు సీట్లు ఇస్తారో లేదో చూడాలి.