యువతపై లోకేష్ ఫోకస్..టీడీపీకి కలిసొస్తారా?

రాజకీయాల్లో యువత ప్రాధాన్యత ఎక్కువనే చెప్పాలి..వారు గెలుపోటములని పెద్ద స్థాయిలో ప్రభావితం చేస్తారు. యువత ఎటువైపు మొగ్గితే ఆ పార్టీ గెలుపు సులువు అని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని, ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుందని, పెద్ద ఎత్తున కంపెనీలు వస్తాయని, అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పి జగన్..యువతని గేలంలో వేసుకున్నారు. యువత కూడా జగన్‌ని నమ్మారు.

పెద్ద స్థాయిలో జగన్‌కు ఓటు వేశారు. ఆ తర్వాత జనసేనకు ఓటు వేశారు. యువత ఓట్లు టి‌డి‌పికి తక్కువగానే పడ్డాయి. ఇక జగన్ అధికారంలోకి వచ్చారు..హోదా లేదు..కంపెనీలు లేవు ఉద్యోగాలు లేవు, వాలంటీర్, సచివాలయ ఉద్యోగాలు మాత్రం ఇచ్చారు. అవి ఏ మాత్రం సరిపోలేదు. దీంతో మెజారిటీ యువత జగన్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉంది. పైగా జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి పట్టించుకోలేదు. అయితే యువతని ఆకట్టుకునేలా లోకేష్ ముందుకెళుతున్నారు. ఎలాగో ఓ వర్గం యువత పవన్ వైపు ఉన్నారు.

ఇక మిగిలిన వారిని ఆకట్టుకునేలా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. అలాగే వారికి కీలక హామీలు ఇస్తున్నారు. అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం, కంపెనీలు తెచ్చి..ప్రైవేట్ సంస్థల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించడం, ఉద్యోగాలు రాని నిరుద్యోగ యువతక నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీలు యువతని బాగానే ఆకట్టుకుంటాయని చెప్పాలి.

అయితే కంపెనీలు తెచ్చే విషయంలో టి‌డి‌పి ముందే ఉంటుందని నమ్ముతున్నారు. దీంతో ఈ సారి యువత కాస్త టి‌డి‌పి వైపు మొగ్గు చూపవచ్చు. ఇక టి‌డి‌పి, జనసేన కలిస్తే మెజారిటీ యువత వారి వైపే ఉంటుంది. దీంతో వారి గెలుపుకు కృషి చేయవచ్చు.