జగన్ క్లియర్ స్కెచ్..99.5 అంటూ ఎత్తు.!

నో డౌట్ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం లేదు..షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లనున్నారు. తాజాగా కేబినెట్ సమావేశంలో అదే తేల్చారు. ఇంకా ఎన్నికలకు 9 నెలల సమయం ఉందని, ఈలోపు అందరూ కష్టపడి చేసి..పార్టీ గెలుపుకు కృషి చేయాలని మంత్రులకు సూచించారు. దీంతో జగన్ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళుతున్నారని తెలుస్తుంది. అదే సమయంలో సంక్షేమంతోనే ప్రజల ఓట్లు దక్కించుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఇదివరకు ఎవరు అమలు చేయని విధంగా తాను మాత్రమే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేశానని జగన్ చెబుతున్నారు.

తాజాగా కేబినెట్ లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని 99.5 శాతం హామీలు అమలు చేశానని జగన్ అంటున్నారు.  ఏపీలో కొత్త గా 6840 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2014 జూన్ 2 తేదీ నాటికి 5 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఆమోదం ఇచ్చింది. అమ్మ ఒడి ఆర్థిక సహకారాన్ని జూన్ 28 తేదీన ఇవ్వడానికి నిర్ణయించారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ నెట్ సదుపాయం 5 జి నెట్ వర్క్ కల్పించేందుకు ఏపీ ఎఫ్ఎస్ఎల్ 445 కోట్ల రుణ సేకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 15వ తేదీ నుంచి సురక్ష చక్ర కార్యక్రమం ద్వారా గృహ సారధులు..వాలంటీర్లు నెల రోజుల పాటు ప్రతీ ఇంటికి వెళ్లి పరిశీలన చేసి,  ఎవరైనా అర్హులు మిగిలిపోతే వారిని గుర్తించి లబ్ది చేకూరేలా చర్యలు చేపట్టేలా కార్యాచరణ ఖరారు చేసారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 99.5 శాతం అమలు చేశామని, ఇదే విషయాన్ని వివరిస్తూ..చంద్రబాబు చేసిన మోసాన్ని వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లాలని జగన్ నిర్దేశించారు. అయితే అన్నీ హామీలు అమలు చేశామనే అంశం వైసీపీకి ఓట్లు రాలుస్తుందో లేదో చూడాలి.