కాంగ్రెస్‌లోకి బడా నేతలు..షర్మిల కూడా లైన్‌లోనే ఉన్నారా?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపు వచ్చింది. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆ పార్టీలోకి ఊహించని వలసలు చోటు చేసుకుంటున్నాయి. బడా బడా నేతలు కాంగ్రెస్ వైపు వస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, వేముల వీరేశం, గురునాథ్ రెడ్డి, కోరం కనకయ్య..ఇలా చూసుకుంటే లిస్ట్ చాలా పెద్దది. వారంతా కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకొనున్నారు.

తాజాగా టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసి..జూపల్లి, పొంగులేటిని కలిసి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. వీరంతా కలిసి ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. అలాగే జులై 2న ఖమ్మంలో రాహుల్ గాంధీ సభ జరగనుందని తెలుస్తుంది. ఆ సభలో భారీ స్థాయిలో చేరికలు ఉంటాయని తెలుస్తుంది. ఇదే సమయంలో తెలంగాణ ఉద్యమ నేత కోదండరాం సైతం కాంగ్రెస్ కు సపోర్ట్ గా ఉన్నారు. ఇక ఇటు వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టి రాజకీయం నడిపిస్తున్న వైఎస్ షర్మిల సైతం కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే ప్రచారం ఉంది.

ఆ మధ్యే కర్నాటక పి‌సి‌సి అధ్యక్షుడు డి‌కే శివకుమార్‌ని కలిసి..అక్కడ గెలిచినందుకు అభినందనలు తెలియజేశారు. దీంతో ఆమె కాంగ్రెస్ లో చేరుతున్నారని ప్రచారం వచ్చింది. కానీ ఆమె మాత్రం పార్టీ పెట్టింది..కాంగ్రెస్ లో విలీనం చేయడం కోసం కాదని అన్నారు. ఇక రేవంత్ సైతం..షర్మిల ఆంధ్రాకు చెందిన నాయకురాలు అని, అక్కడ కాంగ్రెస్ లో చేరాతనంటే తమకు ఇబ్బంది లేదని అన్నారు.

దీంతో చేరిక విషయంలో కాస్త క్లారిటీ మిస్ అయింది. ఇదే క్రమంలో ఈ మధ్య షర్మిల..కాంగ్రెస్ జాతీయ నేత కే‌సి వేణుగోపాల్ తో భేటీ అయ్యారని తెలిసింది. అమెరికా నుంచి రాహుల్ వచ్చాక పూర్తి స్థాయిలో మాట్లాడి..తర్వాత అంశాలు చెబుతామని చెప్పినట్లు తెలిసింది. దీంతో షర్మిల కాంగ్రెస్ లో చేరడం ఖాయమని అంటున్నారు. చూడాలి మరి ఆమె కూడా కాంగ్రెస్ లోకి వస్తారో లేదో.