బెజవాడ పాలిటిక్స్: కేశినేని టీడీపీకి గుడ్‌బై?

బెజవాడ రాజకీయాల్లో టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఈ మధ్య వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసిమెలిసి తిరుగుతూ..సొంత పార్టీపైనే విమర్శనస్త్రాలు సంధిస్తున్నారు. దీంతో టి‌డి‌పి నేతలు కాస్త నాని వ్యవహారంపై అసంతృప్తిగా ఉన్నారు. చాలా రోజుల నుంచి టీడీపీలోని కొందరు నేతలతో నానికి పొసగడం లేదు. ఇక వారి టార్గెట్ గానే నాని కామెంట్లు చేస్తున్నారు. కాకపోతే కొందరు పార్టీని తప్పుదారి పట్టిస్తున్నారని, లోపాలని మాత్రమే తాను చెబుతున్నానని అంటున్నారు.

కాకపోతే తాజాగా నందిగామ ఎమ్మెల్యే జగన్, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌లతో కలిసి స్థానికంగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే విజయవాడ ఎంపీగా తన పార్లమెంట్ పరిధిలో ఉండే ఎమ్మెల్యేలతో కలిసి పనిచేయడం తప్పు లేదని, కానీ వైసీపీ ఎమ్మెల్యేలని పొగుడుతూ..పరోక్షంగా టి‌డి‌పి నేతలని టార్గెట్ చేయడమే ఇబ్బంది అవుతుందని చెప్పవచ్చు. మైలవరంలో దేవినేని ఉమా, నందిగామలో తంగిరాల సౌమ్యలకు నాని వ్యవహారం కాస్త ఇబ్బందిగా మారింది.

ఈ అంశంపై టి‌డి‌పి అధిష్టానానికి కూడా ఫిర్యాదులు అందాయని తెలుస్తుంది. అదే సమయంలో విజయవాడ టీడీపీ పార్లమెంట్‌ టికెట్‌ ఏ పిట్టల దొరకు ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని, ప్రజలు కోరుకుంటే స్వతంత్ర అభ్యర్థిగా గెలుస్తానేమో అని అన్నారు. 2019లో అన్ని పార్టీల వాళ్లు తనకు ఓట్లు వేయడం వల్లే గెలిచానన్నారు. పది సార్లు ఎంపీగా చేయాలనే కోరిక తనకు లేదన్నారు.

ఇలా అనడంతో కేశినేని నానిని పక్కన పెట్టి విజయవాడ టి‌డి‌పి ఎంపీ సీటు కేశినేని చిన్నికి ఇస్తారనే ప్రచారం ఉంది. అందుకే నాని ఇలా మాట్లాడుతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఆయన్ని వైసీపీలోకి ఆహ్వానించారు. ఈ క్రమంలోనే ఆయన టి‌డి‌పిని వదిలి వైసీపీలోకి వెళ్తారేమో చూడాలి