గోదావరి జిల్లాల్లో పవన్ పక్కా స్ట్రాటజీ..మద్ధతు పెంచుకునేలా.!

ఇంతకాలం పవన్‌కు కేవలం కాపు సామాజికవర్గం మాత్రమే అండగా ఉంటూ వస్తుంది..అసలు జనసేన అంటే కాపు పార్టీ అనే ముద్ర ఉంది. ఇక జనసేనకు కాపులు తప్ప మరొక వర్గం ఓట్లు వేయరనే విమర్శలు ఉన్నాయి. అయితే గత ఎన్నికల్లో కాపులు కూడా పూర్తి స్థాయిలో పవన్‌కు ఓట్లు వేయలేదు. కానీ ఇప్పుడు కాస్త పరిస్తితి మారుతుంది. మెజారిటీ కాపులు పవన్ వైపే చూస్తున్నారు.

అదే సమయంలో అన్నీ కులాల మద్దతు పొందే దిశగా పవన్ ముందుకెళుతున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలపై తన పట్టు పెంచుకునేలా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయా జిల్లాల్లో ఇతర వర్గాల మద్ధతు సైతం పొందేలా పవన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే కాపు వర్గం ఫుల్ సపోర్ట్ ఉంది. అదే సమయంలో గోదావరి జిల్లాల్లో కీలకంగా ఉన్న ఎస్సీ, శెట్టిబలిజ/గౌడ, మత్స్యకార సామాజికవర్గాల ఓట్లు దక్కించుకునేందుకు పవన్ కష్టపడుతున్నారు.

ఈ క్రమంలోనే ఇటీవల మత్స్యకార వర్గాలతో భేటీ అయిన పవన్..వారిని అన్నీ విధాలా ఆదుకుంటామని, రాజ్యాధికారం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇటు కోనసీమలో ఎస్సీల మద్ధతు పెంచుకునేలా..వ్యూహాలు వేసారు. తాజాగా శెట్టిబలిజ , గౌడ వర్గాలతో పవన్ భేటీ అయ్యారు. వాస్తవానికి గోదావరి జిల్లాల్లో కాపులతో పోటీగా శెట్టిబలిజ-గౌడ కులం ఉంటుంది. అదే సమయంలో కాస్త విభేదాలు కూడా ఉన్నాయి. దీంతో రెండు కులాల మధ్య విభేదాలు తొలగించి..అంతా ఏకతాటిపైకి వచ్చేలా పవన్ కృషి చేస్తున్నారు.

అలాగే తాను జగన్ మాదిరిగా కులాల మధ్య చిచ్చు పెట్టనని చెబుతున్నారు. ఏదో ముగ్గురు, నలుగురుకో నామినేటెడ్ పడవులు ఇచ్చి బీసీలని ఉద్దరించమని చెబితే సరిపోదని..జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీ కులానికి రాజ్యాధికారం దక్కేలా చేయడమే జనసేన లక్ష్యమని చెప్పుకొచ్చారు. మొత్తానికి గోదావరి జిల్లాల్లో అన్నీ కులాలని ఏకం చేసి రాజకీయంగా సత్తా చాటాలని పవన్ చూస్తున్నారు.