కాంగ్రెస్‌లో చేరికల లిస్ట్ పెద్దదే..సీట్ల సర్దుబాటు ఎలా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి ఊహించని వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు పెద్దగా రేసులో లేని పార్టీ..ఇప్పుడు అనూహ్యంగా పుంజుకుని బి‌ఆర్‌ఎస్ పార్టీకి ధీటుగా ముందుకొస్తుంది. ఇదే సమయంలో బి‌జే‌పి వీక్ అవ్వడంతో ఆ పార్టీలోకి వలసలు ఆగిపోయాయి..వరుసగా కాంగ్రెస్ లోకి చేరికలు మొదలయ్యాయి. పెద్ద ఎత్తున చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహ 35 మంది నేతలు ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు.

కేసీఆర్‌ హఠావో.. తెలంగాణ బచావో అన్న నినాదంతో ముందుకెళ్లాలని,  కేసీఆర్‌ కుటుంబ పాలనను, అవినీతిని ప్రజల్లో మరింత బలంగా ఎండగట్టాలని రాహుల్..కాంగ్రెస్ నేతలకు సూచించారు. తాము జూలై 2న కాంగ్రెస్‌ లో చేరతామని పొంగులేటి, జూపల్లి తెలిపారు. ఆ రోజు ఖమ్మంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని, అదేరోజు తాము చేరతామని, ఆ సభకు రావాలని రాహుల్‌గాంధీని పొంగులేటి ఆహ్వానించారు. ఇక పొంగులేటి, జూపల్లితో పాటు దాదాపు 35 మంది నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారు.

మాజీ ఎమ్మెల్యేలు గుర్నాథరెడ్డి, పాయం వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కోరం కనకయ్య, డీసీసీబీ చైర్మన్‌ తుల్లూరి బ్రహ్మయ్య, మాజీ చైర్మన్‌ మువ్వా విజయ్‌బాబు, పిడమర్తి రవి ఇలా పలువురు కీలక నేతలు కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఈ చేరికలు కాంగ్రెస్ పార్టీకి భారీ బెనిఫిట్ అవుతాయని చెప్పవచ్చు. ఇంకా ఇద్దరు ఎమ్మెల్సీలు దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి సైతం కాంగ్రెస్ వైపుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

వీరే కాదు..బి‌జే‌పి నుంచి సైతం వలసలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ లోకి వస్తారని ప్రచారం జరిగింది గాని..ప్రస్తుతానికి వారి చేరికకు బ్రేక్ పడిందని తెలుస్తుంది. అయితే చేరికలు బాగానే ఉన్నాయి గాని..వారికి సీట్ల విషయం లో ఎలా ఎడ్జస్ట్ చేస్తారు అనేది చూడాలి.