టార్గెట్ సీతక్క: ములుగులో 30 వేల మెజారిటీ సాధ్యమేనా?

ధనసరి అనసూయ అలియాస్ సీతక్క..ఈ పేరు తెలియని తెలుగు ప్రజలు ఉండరు. ఒక ప్రజాప్రతినిధి అంటే ఇలాగే ఉండాలనే విధంగా నడుచుకునే నాయకురాలు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారికి అండగా ఉంటూ వస్తున్న సీతక్కకు రాజకీయంగా చెక్ పెట్టేందుకు బి‌ఆర్‌ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఆమెని ఓడించాలని చూస్తున్నారు.

అయితే ప్రజల్లో పాతుకుపోయిన సీతక్కని ఓడించడం అనేది కాస్త కష్టమనే చెప్పాలి. ములుగులో ఆమె బలంగా ఉన్నారు. సీతక్కని ఓడించడం అనేది సాధ్యమయ్యేలా లేదు. అందుకే ములుగు టార్గెట్ గా బి‌ఆర్‌ఎస్ అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టింది. తాజాగా కే‌టి‌ఆర్ సహ పలువురు మంత్రులు ములుగులో పలు అభివృధ్ది కార్యక్రమాలు మొదలుపెట్టారు.  ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నప్పటికీ పక్షపాతం చూపకుండా అభివృద్ధి చేస్తున్నామని,  పార్టీ అభ్యర్ధి ఓడిపోయినా ములుగును జిల్లాగా ఏర్పాటుచేశామని  కే‌టి‌ఆర్ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే దరఖాస్తు కూడా ఇవ్వక ముందే మెడికల్‌ కళాశాలను మంజూరు చేశామని తెలిపారు.

అలాగే పలు సంక్షేమ కార్యక్రమాలని అమలు చేశారు. ఇక మంత్రి  ములుగులో 33వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించి జిల్లా ఇచ్చిన కేసీఆర్‌ రుణం తీర్చుకుంటాంమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్  ప్రకటించారు. అంటే ములుగులో సీతక్కని ఓడించడమే టార్గెట్ గా పెట్టుకున్నారు. కానీ ప్రజల్లో ఎక్కువ అభిమానం ఉన్న సీతక్కని ఓడించడం సాధ్యమయ్యే పని కాదు.

కరోనా సమయంలో ఆమె చేసిన సేవలు దేశమే గుర్తించింది. ఇంకా ములుగు ప్రజలకు ఏ విధంగా అండగా నిలబడ్డారో చెప్పాల్సిన పని లేదు. అలాంటి ఎమ్మెల్యేని ములుగు ప్రజలు మళ్ళీ ఎన్నుకుంటారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. చూడాలి మరి ఈ సారి ములుగులో పై చేయి ఎవరిది అవుతుందో.