సాయిరెడ్డి రిటర్న్స్..జగన్‌కు అండగా..టార్గెట్ టీడీపీ.!

చాలాకాలం తర్వాత వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ రాజకీయాలపై స్పందించడం మొదలుపెట్టారు. తనదైన శైలిలో ప్రత్యర్ధులకు కౌంటర్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు. అసలు కొంతకాలం కిందట..విజయసాయి ఏ విధంగా చంద్రబాబుని టార్గెట్ చేసి తిట్టేవారో చెప్పాల్సిన పని లేదు. తనదైన శైలిలో పరుష పదజాలంతో విరుచుకుపడేవారు. అసలు వైసీపీ నేతలు ప్రతిరోజూ బాబు గురించి మాట్లాడేవారో లేదో గాని..సాయిరెడ్డి మాత్రం బాబుని వదిలేవారు కాదు.

ఆ స్థాయిలో సాయిరెడ్డి ఫైర్ అయ్యారు. అలాంటి నేతకు నిదానంగా వైసీపీలో ప్రాధాన్యత తగ్గింది. అదే సమయంలో తారకరత్న చనిపోయిన సమయంలో చంద్రబాబు, సాయిరెడ్డి కలిశారు. ఇద్దరు బంధువులు కావడంతో..ఆ తర్వాత నుంచి విమర్శలు తగ్గిపోయాయి. సాయిరెడ్డి రాజకీయ విమర్శల జోలికి వెళ్లలేదు. అటు వైసీపీలో యాక్టివ్ గా లేరు. ఏదో భారత ప్రజస్వామ్యం గురించి పోస్టులు పెడుతూ వచ్చారు. కానీ తాజాగా మహానాడు వేదికగా చంద్రబాబు మినీ మేనిఫెస్టో ప్రకటించిన విషయం తెలిసిందే.

“అమలుచేయమంటారేమోనని అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో మేనిఫెస్టోనే మాయం చేసినవారు … ఇప్పుడు అల్ ఫ్రీ హామీలతో మేనిఫెస్టో ప్రకటించారు. ఈ ‘మాయా’ఫెస్టోలో ఎవరు పడతారు?” అని పోస్టు పెట్టారు. ఇక ఇప్పుడు జగన్ సీఎంగా ప్రమాణం చేసి నాలుగేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మరోసారి సాయిరెడ్డి స్పందిస్తూ..జగన్ నాయకత్వంలో సుపరిపాలన కొనసాగుతుందని, 2004-2009 కాలంలో వైఎస్సార్ సమయంలో రాష్ట్రంలో సంక్షేమ పాలన జరిగిందని, 2014-2019 కాలంలో కుదేలైన రాష్ట్రాన్ని, ప్రజలని ఆదుకోవడానికి సీఎం అయిన జగన్..ప్రజా క్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు.

వైసీపీ పాలనలో ఇచ్చిన హామీలు అన్నీ అమలు అయ్యాయని చెప్పుకొచ్చారు. అయితే డైరక్ట్ చంద్రబాబు పేరు తీయడం లేదు గాని పరోక్షంగా ఆయనపై విమర్శలు మాత్రం చేస్తున్నారు. రానున్న రోజుల్లో మరింత దూకుడుగా ఉంటారేమో చూడాలి.