క్లాస్ వార్ వర్సెస్ క్యాష్ వార్..జనం నమ్మేది ఎవరిని.!

వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ఎవరికి వారు సరికొత్త ఎత్తులతో ముందుకొస్తున్నారు. ప్రత్యర్ధులని దెబ్బతీయడానికి వ్యూహాత్మకంగా ముందడుగులు వేస్తున్నారు. మళ్ళీ అధికారం కైవసం చేసుకోవడానికి జగన్ చూస్తుంటే..ఈ సారి ఖచ్చితంగా అధికార పీఠం దక్కించుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గరపడటంతో వారు ప్రజలకు హామీలు ఇవ్వడంతో పాటు..మాటల యుద్ధం కూడా షురూ చేశారు. ఒకరినొకరు దెబ్బతీసేందుకు కొత్త వ్యూహాలు అనుసరిస్తున్నారు.

ఇదే క్రమంలో ఇటీవల కాలంలో జగన్ ప్రతి సభలోనూ క్లాస్ వార్ అంటూ సరికొత్త పదాన్ని ప్రయోగిస్తున్నారు. క్లాస్ వార్ అంటే..పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం అంటున్నారు. అంటే పేద ప్రజలతో పాటు తాను ఒక వైపు ఉంటే..పెత్తందార్లతో పాటు బాబు, పవన్ కలిసి ఒక వైపు ఉన్నారని…ఇప్పుడు వీరే మధ్య పోరు నడుస్తుందని జగన్ అంటున్నారు. పదే పదే జగన్ సభలో ఇదే క్లాస్ వార్ అంటూ మాట్లాడుతున్నారు. పైగా ఎక్కడకక్కడ ఫ్లెక్సీలని కడుతున్నారు.

అయితే జగన్ క్లాస్ వార్‌కు కౌంటర్ ఇచ్చేలా చంద్రబాబు..క్యాష్ వార్ అంటూ సరికొత్త పదం మాట్లాడటం మొదలుపెట్టారు. అంటే జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వేల కోట్ల డబ్బులని దోచుకున్నారని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు విపరీతమైన దోపిడి చేశారని, ఇప్పుడు ఆ దోచుకున్న డబ్బులని ఎన్నికల్లో ఖర్చు పెట్టి ఓట్లు కొనుక్కోవాలని చూస్తున్నారని, అలా క్యాష్ సంపాదించిన వారిని ప్రజలు ఓడించాలని బాబు పిలుపునిస్తున్నారు.

అంటే క్యాష్ ఉన్న జగన్, వైసీపీ నేతలు ఒకవైపు ఉంటే..క్యాష్ లేని పేద, మధ్య  తరగతి ప్రజలు ఒకవైపు ఉన్నారని అంటున్నారు. ఇలా ఇద్దరు నేతలు క్లాస్ వార్, క్యాష్ వార్ అంటూ మాటల యుద్ధానికి దిగుతున్నారు. మరి వీరిలో ఎవరి మాటని ప్రజలు నమ్ముతారో చూడాలి.