రాజకీయ, సినీ ప్రముఖులకు ట్విట్టర్ షాక్.. ఏమైందంటే

ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ గురువారం పలువురు రాజకీయ, సినీ ప్రముఖులకు షాక్ ఇచ్చింది. పలువురు సెలబ్రెటీల ట్విట్టర్ ఖాతాలకు బ్లూ టిక్ తొలగించింది. ఇంతకు ముందు బ్లూ టిక్‌ను ఎటువంటి రుసుము లేకుండా ప్రముఖుల ఖాతాలను ధ్రువీకరించి, వారికి అందజేసేవారు. కానీ నెలకు 11 యూఎస్ డాలర్ల చొప్పున ప్రస్తుతం విధిస్తున్నారు. ట్విట్టర్‌ను ప్రముఖ కుబేరుడు ఎలాన్ మస్క్ చేజిక్కించుకున్న తర్వాత ఈ మార్పు వచ్చింది. తాజాగా ఆ రుసుము చెల్లించకపోవడంతో ప్రముఖుల ఖాతాలకు బ్లూ టిక్ పోయింది. ఈ జాబితాలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇతర సినీ ప్రముఖులు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్, అలియా భట్ తదితరులు ఉన్నారు.

ట్విట్టర్‌లో సెలబ్రెటీల పేరుతో కొందరు నకిలీ ఖాతాలను తెరవకుండా ఉండేందుకు ఈ బ్లూ టిక్ విధానాన్ని ట్విట్టర్ తీసుకొచ్చింది. అయితే బ్లూటిక్ పొందిన సెలబ్రెటీలు చాలా మంది ఉన్నారు. ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత దీని నుంచి ఆదాయం పొందేందుకు ఎలాన్ మస్క్ ప్రణాళికలు రూపొందించాడు. ఇందులో భాగంగా బ్లూటిక్ కావాల్సిన వారు 11 యూఎస్ డాలర్ల చొప్పున రుసుము చెల్లించాలని నిర్ణయించాడు. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, కంపెనీలు, బ్రాండ్‌లు, వార్తా సంస్థలు, “ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన” ఇతర ఖాతాలు అసలైనవని, మోసగాళ్లు లేదా పేరడీ ఖాతాలు కాదని వినియోగదారులకు గుర్తించడంలో సహాయపడటానికి ట్విట్టర్ 2009లో బ్లూ చెక్ మార్క్ విధానాన్ని ప్రవేశపెట్టింది.

ధృవీకరణ కోసం కంపెనీ ఇంతకు ముందు వసూలు చేయలేదు. మస్క్ గత సంవత్సరం కంపెనీ టేకోవర్ అయిన రెండు వారాల్లోనే ప్రీమియం పెర్క్‌లలో ఒకటిగా చెక్-మార్క్ బ్యాడ్జ్‌తో ట్విట్టర్ బ్లూను ప్రారంభించింది. తాజాగా ఆ రుసుమును చెల్లించలేదనే కారణంగా ప్రముఖులకు బ్లూ టిక్‌ను ట్విట్టర్ తొలగించింది. ఈ నిర్ణయంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆ సెలబ్రెటీల కారణంగానే ట్విట్టర్‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య పెరిగిందనే కామెంట్లు వస్తున్నాయి.