అవార్డుల విషయంలో సత్తా చాటుతున్న బలగం.. ఇప్పటికే 40 గ్లోబల్ అవార్డులు

అంతర్జాతీయంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ సాధించిన విజయం అంతాఇంతా కాదు. వసూళ్లతో పాటు విమర్శకుల ప్రశంసలు, అంతర్జాతీయ అవార్డులు సాధించింది. ముఖ్యంగా ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఏకంగా ఆస్కార్ అవార్డు అందుకుంది. ఈ విజయోత్సవం పూర్తి కాకముందే మరో టాలీవుడ్ సినిమా అంతర్జాతీయంగా దుమ్ము రేపుతోంది. వేణు ఎల్దండి దర్శకత్వంలో తెలంగాణ ప్రాంత ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను చూపుతూ బలగం సినిమా రూపొందింది. ఇది ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టిస్తోంది. అంతేకాకుండా ఎంతో కాలంగా విడిపోయిన ప్రజలను ఒక్కటి చేస్తోంది. దీంతో కేవలం మౌత్ టాక్‌తోనే ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా తెలంగాణలోని పల్లెల్లో తెరలు పెట్టి ప్రత్యేక ప్రదర్శనలు వేస్తున్నారు. అంతలా అందరి హృదయాలను ఈ సినిమా హత్తుకుంది. ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన ఈ సినిమాకు అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కుతున్నాయి. ఏకంగా 40 గ్లోబల్ అవార్డులను ఇప్పటి వరకు ఈ సినిమా అందుకుంది. అవార్డుల విషయంలో ఏకంగా ఆర్ఆర్ఆర్‌ను దాటేస్తుందనే అంచనాలు పెరుగుతున్నాయి.

తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ‘బలగం’ సినిమా మంచి వసూళ్లను దక్కించుకుంది. ఇది మార్చి 2023లో లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్‌లలో రెండు అవార్డులను గెలుచుకుంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్, హన్షితారెడ్డి నిర్మించిన ‘బలగం’కు ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ సినిమాటోగ్రఫీ (ఆచార్య వేణు) అవార్డులు లభించాయి. సర్టిఫికెట్లను చిత్ర దర్శకుడు వేణు యెల్దండికి అందజేశారు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్‌ జంటగా నటించిన ఈ సినిమా సర్‌ప్రైజ్‌గా నిలిచింది.

ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. త‌క్కువ బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ.25 కోట్ల గ్రాస్ క‌లెక్ట్ చేయ‌గా, రూ.12 కోట్ల షేర్ వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి, పలువురు టాలీవుడ్ ప్రముఖులు ‘బలగం’ సినిమా ఎన్నో అవార్డులు గెలుచుకుంటుందని అంచనా వేశారు. అవి సరైనవని నిరూపించబడ్డాయి.