ఎస్సీ స్థానాల్లో టీడీపీకి ఒక్క సీటు రాదా..వైసీపీకి రివర్స్.!

యర్రగొండపాలెంలో చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్ళ దాడి జరగడం, అక్కడ మంత్రి ఆదిమూలపు సురేశ్ చొక్కా విప్పి నిరసన తెలియజేయడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిడే. అయితే ఎక్కడ లేని విధంగా యర్రగొండపాలెంలో సురేశ్..తన అనుచరులతో కలిపి..బాబు రోడ్ షో వద్ద నిరసన తెలియజేశారు. దళితులకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో పోలీసులు సైతం వైసీపీ శ్రేణులకు ఫుల్ సపోర్ట్ చేసి, టి‌డి‌పి శ్రేణులపై లాఠీ చార్జ్ చేశారని, ఆ పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు.

ఇక యర్రగొండపాలెం ఇష్యూపై అటు  టి‌డి‌పి నేతలు..మంత్రి సురేశ్ తీరుపై మండిపడుతుంటే..ఇటు వైసీపీ నేతలు చంద్రబాబుపై ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేత జూపూడి ప్రభాకర్..బాబుపై విరుచుకుపడ్డారు. దళితులు ఏం పీకుతారు.. అంటూ చంద్రబాబు కొడుకు నారా లోకేష్ అవమానించాడని, ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని మాట్లాడిన నోరు చంద్రబాబుదని, దళిత నియోజకవర్గాల్లోనే కాకుండా ఏ సీటులో కూడా టీడీపీకి గెలిచే పరిస్థితి లేదని అన్నారు.

అయితే లోకేశ్, బాబు మాటలని వైసీపీ పూర్తిగా వక్రీకరించినట్లే కనిపిస్తుంది. ఎందుకంటే జగన్..దళితులకు పీకింది ఏమి లేదని లోకేశ్ అన్నారు..అంటే దళితులకు జగన్ ఏం చేయలేదని అన్నారు. ఇటు బాబు సైతం ఆ మాట అన్న సందర్భం వేరు..దళితులని మంచి ఉద్దేశంతో అన్నారు. కానీ దాన్ని కూడా వైసీపీ వక్రీకరించి దానిపై ఇప్పటికీ ప్రచారం చేసుకుంటుంది.

ఇక రాష్ట్రంలో 29 ఎస్సీ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ 27, జనసేన 1, టి‌డి‌పి 1 సీటు గెలుచుకుంది. అయితే జూపూడి చెప్పినట్లు ఎస్సీ సీట్లలో ఒక్కటి కూడా టి‌డి‌పి గెలవదని అన్నా కూడా జరిగే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ స్థానాల్లో వైసీపీకి ధీటుగా టి‌డి‌పి ఉంది. సగం స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉంది.