జగన్ వ్యూహాలు వర్కౌట్ అవ్వట్లేదా?

రాజకీయాల్లో పరిస్తితులని బట్టి తనదైన శైలిలో వ్యూహాలు వేసి వాటిని సక్సెస్ చేయడంలో జగన్‌ని మించిన వారు లేరనే చెప్పాలి. ఎలాంటి పరిస్తితినైనా తనకు అనుకూలంగా మార్చేసుకుంటారు. అయితే ఇంతకాలం జగన్‌కు అనుకూలమైన రాజకీయమే నడిచింది. కానీ కొంతకాలం నుంచి సీన్ రివర్స్ అవుతుంది. వైసీపీకి పరిస్తితులు అనుకూలించడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి సీన్ మారుతూ వస్తుంది.

అయితే వ్యతిరేక పరిస్తితులని పోగొట్టేందుకు జగన్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు..కానీ అవి పెద్దగా వర్కౌట్ కావడం లేదు. ఇటీవల కాలంలో వివేకా హత్య కేసు, కోడి కత్తి కేసులు పూర్తిగా వైసీపీకి రివర్స్ అయిపోయాయి. గత ఎన్నికల ముందు ఈ రెండే వైసీపీ గెలుపుకు సహకరించాయి. కానీ ఇప్పుడు వాటిల్లో నిజనిజాలు ఏంటో బయటపడుతున్నాయి. ఇప్పుడు ఏకంగా జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి ఇరుక్కునే పరిస్తితి వచ్చింది. అవినాష్ అరెస్ట్ అవ్వలేదు గాని ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మాత్రం వైసీపీకి పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు.

ఆ పరిస్తితులని డైవర్ట్ చేసి..ప్రజల్లో సెంటిమెంట్ లేపి మళ్ళీ తన వైపుకు తిప్పుకోవాలని జగన్ చూస్తున్నారు. కానీ అవేమీ వర్కౌట్ అవ్వడం లేదు. తాజాగా విశాఖలో కాపురం పెట్టడానికి రెడీ అయ్యామని జగన్ చెప్పిన విషయం తెలిసిందే. అంటే విశాఖ నుంచి పాలన మొదలుపెట్టడానికి సిద్ధమవుతున్నానని అన్నారు. అయితే వివేకా కేసుని డైవర్ట్ చేయడానికే జగన్ విశాఖ పేరు తెచ్చారు.

కానీ అది జనం నమ్మడం లేదు. ఎన్నికలు దగ్గరపడిపోతున్నాయి..ఇలాంటి సమయంలో జగన్ విశాఖకు వస్తానని చెబుతున్నా..అక్కడే ప్రజలే నమ్మడం లేదు. అలాగే తాను ఒంటరి అని, తోడేళ్లు గుంపు మాదిరిగా చంద్రబాబు, పవన్ వస్తున్నారని, తనకు సొంత మీడియా లేదని జగన్ సెంటిమెంట్ లేపుతున్నా ప్రజలు నమ్మడం లేదు. కాబట్టి జగన్ ఎన్ని వ్యూహాలు వేసిన రివర్స్ అవుతున్నాయి.