ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌ల్లే ర‌వితేజ స్టార్ హీరో అయ్యాడ‌ని మీకు తెలుసా?

ర‌వితేజ‌.. అస‌లు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు. తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేటలో జ‌న్మించిన ఈయ‌న‌.. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోయినా సినిమాల‌పై ఉన్న మ‌క్కువ‌తో ఇండ‌స్ట్రీ వైపు అడుగులు వేశాడు. అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా కెరీర్ ప్రారంభించి.. ఆపై క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్ర‌ల‌ను పోషించాడు.

1997 లో కృష్ణవంశీ తీసిన `సింధూరం`లో బ్రహ్మాజీతో పాటు సెకండ్ హీరోగా చేశాడు. ఆ త‌ర్వాత `నీ కోసం` మూవీతో పూర్తి స్థాయి హీరోగా మారాడు. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి వంటి చిత్రాల‌తో స్టార్ హోదాను అందుకున్నాడు. అయితే ఆ హోదాను ప‌టిష్ఠం చేసిన చిత్రం `విక్రమార్కుడు`. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందించిన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఈ మూవీతోనే ర‌వితేజ టాలీవుడ్ లో తిరుగులేని హీరోగా అవ‌త‌రించాడు.

అయితే నిజానికి విక్రమార్కుడు కోసం రాజ‌మౌళి మొద‌ట అనుకున్న హీరో ర‌వితేజ కాద‌ట‌. ఈ కథను రాజమౌళి పవన్ కల్యాణ్‌ కోసం రెడీ చేయించాడు. ఆయన్ను ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూపించాలని అనుకున్నాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు క‌థ వినిపించ‌గా.. ఆయ‌న‌కు బాగా న‌చ్చింది. కానీ, అప్ప‌టికే చేతినిండా ప్రాజెక్ట్ లు ఉండ‌టంతో..ఇప్పట్లో డేట్స్ ఇవ్వలేనని సున్నితంగా చెప్పాడంట. కావాలంటే రవితేజ లాంటి హీరోను తీసుకోమని సలహా ఇచ్చాడంట. దాంతో రాజ‌మౌళి సైతం ర‌వితేజ వైపు మొగ్గు చూపాడు. క‌ట్ చేస్తే 2006లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎన్నో రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. ర‌వితేజ కెరీర్ లో ఓ మైల్‌స్టోన్ మూవీగా నిలిచింది. మొత్తానికి అలా ర‌వితేజ స్టార్ హీరో కావ‌డానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌రోక్షంగా కార‌ణం అయ్యాడు.