గన్నవరం టీడీపీలో ట్విస్ట్‌లు..సీటు కోసం పోటీ.!

2019 వరకు తెలుగుదేశం పార్టీ కంచుకోట..ఇప్పుడు వల్లభనేని వంశీ అడ్డాగా మారిన గన్నవరం నియోజకవర్గంలో రాజకీయం ఊహించని విధంగా మారింది. అక్కడ టి‌డి‌పిలో గెలిచి వైసీపీలోకి వెళ్ళిన వంశీకి చెక్ పెట్టాలని టి‌డి‌పి శ్రేణులు కసి మీద ఉన్నాయి. గత  ఎన్నికల్లో టి‌డి‌పి నుంచి గెలిచి వంశీ వైసీపీలోకి వెళ్ళిన విషయం తెలిసిందే. వైసీపీలోకి వెళ్ళి బాబుపై ఎలాంటి విమర్శలు చేస్తున్నారో చెప్పాల్సిన పని లేదు.

అలాగే వంశీ వైసీపీలోకి వెళ్ళడంతో టి‌డి‌పికి సరైన నాయకుడు లేకుండా పోయారు. మొన్నటివరకు బచ్చుల అర్జునుడు ఇంచార్జ్ గా ఉన్నారు..కానీ ఇటీవలే ఆయన అనారోగ్యంతో మరణించారు. దీంతో గన్నవరంలో టి‌డి‌పికి నాయకుడు లేరు. కానీ అక్కడ పోటీ చేయాలని చాలామంది పోటీ పడుతున్నారు. ఇప్పటికే కొనకళ్ళ నారాయణ..నియోజకవర్గ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఇటు టి‌డి‌పి అధికార ప్రతినిధి పట్టాభి సైతం గన్నవరం సీటు ఆశిస్తున్నారు. అటు విజయవాడ టి‌డి‌పి కార్పొరేటర్ దేవినేని అపర్ణ సైతం గన్నవరం సీటు కోరుతున్నారు. ఇంకా పలువురు నేతలు గన్నవరం సీటుపై ఆశలు పెట్టుకున్నారు.

ఇదే క్రమంలో తాజాగా చింతమనేని ప్రభాకర్ గన్నవరంకు వచ్చి చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలని ఘనంగా చేశారు. ఇదే సమయంలో ఇక్కడ ఒక నేత పోటీ చేయాలని చూస్తున్నారని, 150 కోట్లు కూడా ఖర్చు పెట్టాలని అనుకుంటున్నారని చెప్పుకొచ్చారు. దీంతో గన్నవరం లో గెలవాలని  టి‌డి‌పి ఎలా ప్లాన్ చేస్తుందో అర్ధమవుతుంది.

అయితే సీటు తేల్చాల్సింది చంద్రబాబు మాత్రమే..ఆయన ఎవరి వైపు ఉంటారనేది క్లారిటీ లేదు. పోటీ పడటానికి చాలామంది నేతలు ఉన్నారు. పైగా టి‌డి‌పి నుంచి వైసీపీలోకి వెళ్ళిన మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధన రావు సైతం మళ్ళీ టి‌డి‌పిలోకి రావడానికి చూస్తున్నారు. దీంతో గన్నవరం టి‌డి‌పి సీటు విషయంలో ట్విస్ట్ లు నడుస్తున్నాయి.