గుడివాడకు బాబు..భారీ సభ..టీడీపీకి కలిసొస్తుందా?

తెలుగుదేశం పార్టీ శ్రేణులు బాగా కసితో ఓడించాలని చూస్తున్న నేత ఎవరైనా ఉన్నారంటే అది కొడాలి నాని అని చెప్పవచ్చు. ఆయనపైనే ఎందుకు కసి మీద ఉన్నారనేది అందరికీ తెలిసిందే. టి‌డి‌పిలో రాజకీయంగా ఎదిగి తర్వాత వైసీపీలోకి వెళ్ళి..చంద్రబాబుని కొడాలి నానా బూతులు తిడుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక..ఓ రేంజ్ లో బాబుని టార్గెట్ చేసి తిట్లు తిడుతున్నారు. వ్యక్తిగతంగా తిట్టడం మాత్రమే కాదు..ఫ్యామిలీ పరంగా కూడా తిడుతున్నారు.

దీంతో కొడాలికి ఎలాగైనా ఈ సారి గుడివాడలో చెక్ పెట్టాలని టి‌డి‌పి శ్రేణులు రగులుతున్నాయి. కానీ అందుకు తగ్గట్టుగా గుడివాడలో పరిస్తితులు లేవు. అక్కడ కొడాలికి చెక్ పెట్టడం కష్టమనే పరిస్తితి. పైగా టి‌డి‌పిలో నాయకుల మధ్య ఆధిపత్య పోరు ఉంది. సీటు కోసం నేతలు పోటీ పడుతున్నారు. దీంతో ఇప్పటికీ గుడివాడలో కొడాలికి ఎడ్జ్ ఉంది. నెక్స్ట్ ఎన్నికల్లో కూడా కొడాలిని ఓడించడం సాధ్యం కాదన్నట్లే పరిస్తితి ఉంది.

ఇలాంటి సమయంలో చంద్రబాబు గుడివాడ పర్యటనకు వెళుతున్నారు. చాలా రోజుల తర్వాత ఆయన గుడివాడకు వస్తున్నారు. టి‌డి‌పి ఓడిపోయాక ఆయన గుడివాడకు రాలేదు. గతేడాది మినీ మహానాడుకు ప్లాన్ చేశారు గాని..వర్షాల వల్ల ఆ కార్యక్రమం రద్దయింది. ఇక ఇప్పుడు ఆయన గుడివాడ పర్యటన ఫిక్స్ అయింది. ఈ నెల 12 తేదీ నుంచి ఆయన కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే 13వ తేదీన గుడివాడకు రానున్నారు.

గుడివాడలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. అయితే బాబు పర్యటన తర్వాత గుడివాడలో టి‌డి‌పికి కాస్త ఊపు వస్తుందేమో చూడాలి. అదే సమయంలో ఇక్కడ టి‌డి‌పికి సరైన అభ్యర్ధిని ఫిక్స్ చేయాల్సి ఉంది. త్వరగా బాబు ఆ పనిచేస్తే టి‌డి‌పికి అడ్వాంటేజ్ అవుతుంది.