గిద్దలూరులో బాబు జోరు..టీడీపీకి ఛాన్స్ దొరుకుతుందా?

గత కొన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీ గెలుపుకు దూరమైన స్థానాల్లో గిద్దలూరు కూడా ఒకటి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న ఈ స్థానంలో టి‌డి‌పి గెలుపుకు దూరమై 20 ఏళ్ళు పైనే అయిపోయింది. ఎప్పుడు 1999 ఎన్నికల్లో చివరిగా గెలిచింది. అంతకముందు 1985, 1994 ఎన్నికల్లో మాత్రమే టి‌డి‌పి గెలిచింది. ఇంకా అంతే పెద్దగా గిద్దలూరులో టి‌డి‌పి జెండా ఎగరలేదు.

2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయింది. గత రెండు ఎన్నికల్లో వైసీపీ గెలుస్తూ వస్తుంది. ఇక 2014లో వైసీపీ నుంచి గెలిచిన అశోక్ రెడ్డి టి‌డి‌పిలోకి రాగా, టి‌డి‌పి నుంచి పోటీ చేసి ఓడిపోయిన అన్నా రాంబాబు వైసీపీలోకి వెళ్లారు. 2019 ఎన్నికల్లో వారి మధ్యే ఫైట్ నడవగా, వైసీపీ నుంచి రాంబాబు దాదాపు 81 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. అంత మెజారిటీతో గెలిచి కూడా రాంబాబు..గిద్దలూరుకు పెద్దగా చేసిందేమి కనబడటం లేదు. దీంతో ఆయనపై వ్యతిరేకత కనిపిస్తుంది. ఇటు టి‌డి‌పి ఇంచార్జ్ అశోక్ రెడ్డి పికప్ అవుతున్నారు.

ఇలాంటి తరుణంలో చంద్రబాబు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా గిద్దలూరుకు వెళ్లారు. అయితే గిద్దలూరులో బాబు రోడ్ షోకు, సభకు భారీ ఎత్తున జనం వచ్చారు.  గిద్దలూరులో సుమారు 2.1 కిలోమీటర్ల పొడవునా ఆయన రోడ్‌ షో జరిగింది. ఆరంభం నుంచి చివరి వరకు కూడా జనం కిక్కిరిసి కనిపించారు. అలాగే రాత్రి 9 గంటలకు సభ జరిగినా, భారీ ఎత్తున జనం కనిపించారు.

దీని బట్టి చూస్తే గిద్దలూరులో టి‌డి‌పి శ్రేణులు ఎంత కసితో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఇక్కడ నుంచే గిద్దలూరులో టి‌డి‌పికి మరింత ఊపు పెరిగిందని చెప్పవచ్చు. ఇదే ఊపు కొనసాగితే గిద్దలూరులో టి‌డి‌పి జెండా ఎగరడం ఖాయమని చెప్పవచ్చు.