బీజేపీతో బాబు..రాష్ట్రంలో పొత్తు ఉంటుందా?

చాలా రోజుల నుంచి ఏపీ రాజకీయాల్లో పొత్తుల గురించి పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఎవరెవరు పొత్తు పెట్టుకుంటారో క్లారిటీ లేకుండా ఉంది. కానీ టి‌డి‌పి-జనసేన-బి‌జే‌పి పొత్తు దిశగా వెళుతున్నాయనే ప్రచారం ఉంది. ఇదే సమయంలో బి‌జే‌పి ఏమో టి‌డి‌పితో పొత్తుకు సుముఖంగా లేదని అంటుంది. ఇటు టి‌డి‌పి శ్రేణులు సైతం బి‌జే‌పితో పొత్తుకు రెడీగా లేదు. అటు జనసేన ఏమో బి‌జే‌పితో పొత్తులో ఉంది.

ఇక బి‌జే‌పితో కలిసి ముందుకెళితే గెలవడం కష్టం..అందుకే టి‌డి‌పితో కలవాలని పవన్ చూస్తున్నారు. బి‌జే‌పిని కలుపుకుని టి‌డి‌పితో కలవాలని చూస్తున్నారు..కానీ బి‌జే‌పి ఏమో..టి‌డి‌పితో కలవడానికి రెడీగా లేదు. ఈ పరిణామాల క్రమంలో జనసేన బి‌జే‌పిని వదిలేసి టి‌డి‌పితో కలవాలని భావిస్తుంది. అయితే ఇప్పటివరకు పొత్తులపై ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇదే సమయంలో తాజాగా చంద్రబాబు జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బి‌జే‌పి తో పొత్తు విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎన్‌డీఏతో తమ పార్టీ రాజకీయంగా కలుస్తుందా లేదా అనేది కాలం నిర్ణయిస్తుందని, ఎన్డీఏలో ఉన్నప్పుడు కూడా ప్రధాని మోదీతో తమకు విధానపరమైన విభేదాలేవీ లేవని, ఆయన విధానాలను వ్యతిరేకించలేదని, రాష్ట్ర ప్రజల సెంటిమెంట్‌ దృష్ట్యా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరామని… అది రాకపోవడం వల్లే బయటకు వచ్చామని గుర్తుచేశారు.

ఇక ఎన్‌డీఏ నుంచి వెళ్లిపోయినందుకు విచారిస్తున్నారా అన్న ప్రశ్నకు.. ఆయన సూటిగా సమాధానం ఇవ్వలేదు. తనకు అధికారం ముఖ్యం కాదని, వాజపేయి మా పార్టీకి తన మంత్రివర్గంలో 7-8 మంత్రి పదవులు ఇస్తామన్నా తాము తీసుకోలేదని, దేశం విషయంలో రాజకీయాలకు తావు లేదని, ఎక్కడ అభివృద్ధి ఉన్నా తాము కలుస్తామని అన్నారు. దీని బట్టి చూస్తే బి‌జే‌పితో కలుస్తారో లేదో క్లారిటీ లేదు గాని…బి‌జే‌పి గాని పొత్తు కోసం ముందుకొస్తే మాత్రం చంద్రబాబు కలిసేలా ఉన్నారు.