ఏపీలో ముందస్తు..జగన్ ప్లాన్ అదేనా!

ఏపీలో మళ్ళీ ముందస్తు ఎన్నికలపై చర్చ మొదలైంది..జగన్ షెడ్యూల్ కంటే ముందుగానే ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తుకు వెళ్ళే ఛాన్స్ ఉందని..ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎప్పటికప్పుడు చెబుతూనే వస్తున్నారు. ముందస్తుకు పార్టీ శ్రేణులు రెడీగా ఉండాలని ఆయన సూచిస్తున్నారు. అంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చిన సిద్ధంగా ఉండాలని తమ పార్టీ శ్రేణులని రెడీ చేస్తున్నారు.

కానీ చంద్రబాబు ముందస్తు మాటలని వైసీపీ ఖండిస్తూనే వస్తుంది. తమకు ప్రజలు పూర్తికాలం పాలించే సమయం ఇచ్చారని,పూర్తి  కాలం అధికారంలో ఉంటామని, ముందస్తుకు వెళ్ళే అవకాశం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇలా ముందస్తుపై చర్చ నడుస్తూనే ఉంది. ఇదే క్రమంలో తాజాగా మరోసారి ముందస్తు ఎన్నికలపై చర్చ మొదలైంది. ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఇటు టి‌డి‌పి నేత బోండా ఉమా, అటు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్టేట్‌మెంట్లు ఇచ్చారు.

ఏపీలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జనసేనతో పొత్తు నిర్ణయం.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ లు కలసి తీసుకుంటారని బోండా చెప్పారు. ప్ర‌స్తుతం ఢిల్లీ వెళ్లిన సీఎం జ‌గ‌న్‌.. ఇదే విష‌యంపై ప్రధాని మోదీతో చర్చిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా లతో భేటీలో ఇదే అంశంపై మాట్లాడే అంశం ఉండొచ్చు అంటున్నారు. ఈ ఏడాది చివ‌రి నాటికి తెలంగాణ‌లో ఎన్నిక‌లు ఉన్నాయి. ఇవి రాజ‌కీయంగా ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉందని, అదే సమయంలో తెలంగాణ‌తో పాటు.. ఏపీలోనూ ఎన్నిక‌లు నిర్వ‌హించేలా జ‌గ‌న్ ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం ఉంది.

కాగా, జగన్ గ్రాఫ్ పడిపోతుందని, పూర్తిగా పడిపోయే లోపు జగన్ ముందస్తుకు వెళ్ళేలా ప్లాన్ చేస్తున్నారని రఘురామ అంటున్నారు. తెలంగాణతో పాటే ఏపీ ఎన్నికలు నిర్వహించాలని మోదీని కలిసి జగన్ విన్నవించుకున్నారని అంటున్నారు. చూడాలి మరి ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయో లేదో.