బాబు దూకుడు..జగన్‌కు చెక్ సులువా?

మూడు పట్టభద్రులు, ఒక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టి‌డి‌పి విజయం సాధించడంతో..ఆ పార్టీకి కొత్త ఊపు వచ్చింది. చాలా ఏళ్ల తర్వాత అనేక ఓటములు తర్వాత టి‌డి‌పికి సరైన విజయాలు దక్కాయి. ఇంతకాలం అధికార వైసీపీ ముందు టి‌డి‌పి తేలిపోతూ వచ్చింది..కానీ ఇప్పుడు వైసీపీకి చెక్ పెట్టే విధంగా టి‌డి‌పి బలపడింది. అయితే ఇదే ఊపుతో వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీని ఓడించి అధికారంలోకి వస్తామని టి‌డి‌పి అధినేత చంద్రబాబు ధీమాగా ఉన్నారు.

తాజాగా మార్చి 29 టి‌డి‌పి ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని..హైదరాబాద్ లో జరిగిన సభలో..జగన్ ప్రభుత్వంపై బాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పాలకుడిని ఏమనాలో అర్థం కావడం లేదని,  సైకో అనాలా.. పనికిమాలిన దద్దమ్మ అనాలా.. చేతగాని వ్యక్తి అనాలా.. విధ్వంసకారుడు అనాలా.. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికే పుట్టాడని అనాలా? అంటూ ఫైర్ అయ్యారు.

అమరావతిని సర్వనాశనం చేసి.. ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఏది అంటే అర్థం లేకుండా మూడు ముక్కలాట చేశారని, ఇది ఒక్క ఏపీ వారే కాదు.. ఏ దేశంలో ఉన్న తెలుగువారైనా సిగ్గుపడాల్సిన విషయమని అన్నారు.

సైకో జగన్‌ వల్లే ఏపీ అభివృద్ధి 30 ఏళ్లు వెనక్కి పోయిందని, రాష్ట్రంలో ఏం చేసినా కేసులే.. ఇప్పుడు గన్‌ కల్చర్‌ కూడా వచ్చిందని, మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలి.. ఇది చారిత్రక అవసరమని, కచ్చితంగా వస్తాం.. రాష్ట్ర పునర్నిర్మాణానికి నాంది పలుకుతామని బాబు చెప్పుకొచ్చారు. అంటే ఎమ్మెల్సీలు గెలిచిన ఊపులో ఉన్న బాబు…నెక్స్ట్ టి‌డి‌పి అధికారంలోకి వస్తుందనే ధీమాతో ఉన్నారు.

అయితే జగన్ కు చెక్ పెట్టడం అంత సులువా? అంటే కష్టమనే చెప్పాలి. ఎందుకంటే అధికార బలంతో ఉన్న జగన్ ని నిలువరించడం అంతగా సాధ్యం కాదు..పైగా జగన్..సంక్షేమ పథకాలపైనే ఆశలు పెట్టుకున్నారు. కాకపోతే పవన్ ని కలుపుకుని వెళితే బాబు..జగన్ కు చెక్ పెట్టే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు.