ఏజెన్సీ సీట్లపై టీడీపీ ఆశలు వదులుకున్నట్లేనా?

ఏపీలో ఉన్న ఏజెన్సీ సీట్లలో టి‌డి‌పికి మొదట నుంచి పట్టు లేదనే చెప్పాలి.  ఏజెన్సీ పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో టి‌డి‌పి పెద్దగా విజయాలు అందుకున్న దాఖలాలు లేవు. ఇక గత రెండు ఎన్నికల్లో ఏజెన్సీ పరిధిలో వైసీపీ హవా నడిచింది..ఈ సారి ఎన్నికల్లో కూడా అక్కడ వైసీపీ హవానే నడుస్తుందని తాజా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ రాష్ట్రంలో టి‌డి‌పి గాలి ఉన్నా సరే ఏజెన్సీల్లో గెలవడం కష్టమని తేలింది.

ఏజెన్సీ పరిధిలో ఉన్న పాలకొండ, కురుపాం, సాలూరు, పార్వతీపురం , అరకు, పాడేరు, రంపచోడవరం, పోలవరం లాంటి స్థానాల్లో టి‌డి‌పి గెలుపు చాలా కష్టమని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఈ స్థానాలని వైసీపీనే కైవసం చేసుకుంది. అయితే అధికారంలోకి వచ్చాక ఆ స్థానాల్లో ఉన్న ఎమ్మెల్యేల పనితీరు పెద్దగా ఏమి బాగోలేదు. ఏదో అలా అలా ఉంది. కానీ వైఎస్సార్ ఫ్యామిలీ పట్ల..ఆ స్థానాల్లోని ప్రజలకు అభిమానం ఎక్కువ. అదే జగన్ పై కొనసాగుతుంది. పైగా జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్లస్ అవుతున్నాయి.

దీంతో అక్కడి ప్రజలు ఇప్పటికీ వైసీపీ వైపే ఉన్నారు. ఎమ్మెల్యేలతో పని లేకుండా జగన్‌ని చూసి అక్కడి ప్రజలు వైసీపీకి మద్ధతు ఇస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఈ స్థానాలని వైసీపీ కైవసం చేసుకోవడం ఖాయమని తెలుస్తోంది. కొద్దో గొప్పో పార్వతీపురంలో మాత్రమే టి‌డి‌పికి గెలిచే అవకాశాలు ఉన్నాయి గాని..మిగిలిన స్థానాల్లో ఛాన్స్ కనిపించడం లేదు. ఆ స్థానాల్లో ఇప్పటికీ టి‌డి‌పి బలపడలేదు. వైసీపీ ఎమ్మెల్యేలపై యాంటీ ఉన్నా సరే దాన్ని ఉపయోగించుకుని బలపడలేని స్థితిలో టి‌డి‌పి ఉంది. కాబట్టి ఈ సారి కూడా ఏజెన్సీ పరిధిలో టి‌డి‌పికి దెబ్బతప్పేలా లేదు.