కైకలూరులో జనసేనకు లైన్ క్లియర్..టీడీపీ తేల్చేసిందా?

పొత్తు ఉంటే జనసేనకు టీడీపీ ఏ ఏ సీట్లు ఇస్తుందనే అంశంపై ఎప్పటికప్పుడు చర్చ నడుస్తూనే ఉంది. పొత్తు అధికారికంగా ఫిక్స్ కాలేదు గాని..అనధికారికంగా మాత్రం పొత్తు ఉంటుందని ప్రచారం నడుస్తోంది. ఇదే సమయంలో జనసేనకు టి‌డి‌పి కొన్ని సీట్లు ఇస్తుందని చెప్పి..ఆ సీట్లపై చర్చ నడుస్తోంది. ఇదే క్రమంలో ఎప్పటినుంచో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కైకలూరు సీటు జనసేనకు దక్కుతుందని ప్రచారం ఉంది.

మొదట నుంచి పొత్తు ఉంటే ఈ సీటు జనసేనకే అంతా అనుకుంటున్నారు. ఇక అందుకు తగ్గట్టుగానే అక్కడ ఉన్న టి‌డి‌పి నేత జయమంగళ వెంకటరమణ వైసీపీలోకి జంప్ చేయడంతో జనసేనకు లైన్ క్లియర్ అయిందని చెప్పవచ్చు. 2009లో కైకలూరు నుంచి గెలిచిన జయమంగళకు 2014లో సీటు దక్కలేదు. పొత్తులో భాగంగా కైకలూరు సీటు బి‌జే‌పికి దక్కింది. ఇక 2019 ఎన్నికల్లో జయమంగళ పోటీ చేసి..వైసీపీ నేత దూలం నాగేశ్వరరావు చేతులో ఓడిపోయారు. ఓడిపోయిన దగ్గర నుంచి పార్టీలో అనుకున్న మేర యాక్టివ్ గా పనిచేయట్లేదు.

పైగా ఈ సీటు జనసేనకు ఇస్తారనే ప్రచారంతో జయమంగళ దూకుడుగా పనిచేయట్లేదు. అయితే పొత్తు దాదాపు ఫిక్స్ అవుతున్న నేపథ్యంలో జయమంగళ రూట్ మార్చేశారు. ఇంకా టి‌డి‌పి లో ఉంటే సీటు దొరకదని ఫిక్స్ అయ్యి..వైసీపీలోకి జంప్ చేశారు. పైగా జగన్..జయమంగళకు ఎమ్మెల్సీ ఆఫర్ కూడా ఇచ్చారని తెలిసింది.

అయితే జయమంగళ జంప్ తో కైకలూరులో టి‌డి‌పికి ఓ తలనొప్పి తగ్గిందని అంటున్నారు. పొత్తు ఉంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ సీటుని జనసేనకు ఇచ్చేయొచ్చు అని అనుకుంటున్నారు. మొత్తానికి జయమంగళ వైసీపీలోకి జంప్ అయ్యి..జనసేనకు లైన్ క్లియర్ చేశారు.