ఈటల మళ్ళీ ‘కారు’లోకి..కేసీఆర్ మ్యాజిక్?

మాటలతో మాయ చేసే విషయంలో తెలంగాణ సి‌ఎం కే‌సి‌ఆర్ లేరనే చెప్పాలి. ఎలాంటి వ్యతిరేక పరిస్తితులు ఉన్న వాటికి అనుగుణంగా మార్చుకోవడంలో ఆయన్ని మించిన వారు లేరు. ప్రత్యర్ధులని సైతం మెప్పించగల వాక్చాతుర్యం ఆయనకు ఉంది. తాజాగా అలాంటి వాక్చాతుర్యంతోనే అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలని ఆకట్టుకున్నారు. గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే.

ఈ సమావేశాల్లో అధికార బి‌ఆర్‌ఎస్ నేతలు, ముగ్గురే ఉన్న బి‌జే‌పి నేతల మధ్య పెద్ద మాటల యుద్ధం జరుగుతుంది. అటు మిత్రపక్షంగా ఉన్న ఎం‌ఐ‌ఎం సైతం..బి‌ఆర్‌ఎస్ పార్టీని గట్టిగా టార్గెట్ చేసింది. మధ్య మధ్యలో కాంగ్రెస్ పార్టీ సైతం బి‌ఆర్‌ఎస్ పార్టీకి చురకలు అంటిస్తుంది. ప్రధానంగా చెప్పాలంటే బి‌జే‌పి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తనదైన శైలిలో బి‌ఆర్‌ఎస్‌ని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేశారు. ఇక ఆయనకు కే‌టి‌ఆర్, హరీష్ రావు కౌంటర్ ఇచ్చే ప్రయత్నాలు చేశారు.

ఇలా మాటల యుద్ధం జరుగుతుంటే..తాజాగా కే‌సి‌ఆర్ ఎంట్రీ ఇచ్చి బడ్జెట్ పై మాట్లాడి..ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఏ సమస్యపై మాట్లాడిన దానికి సానుకూలంగా స్పందించి వాటిని పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వ అధికారులకు సూచించారు. అందులో ప్రధానంగా ఈటల ప్రస్తావించిన సమస్యలని ఎక్కువ చెబుతూ..తన మిత్రుడు ఈటల చెప్పిన సమస్యలని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఇలా కే‌సి‌ఆర్ పూర్తిగా విపక్ష సభ్యులకు అనుకూలంగా మాట్లాడి..కొత్త రాజకీయానికి తెరలేపారు..

ఇదే క్రమంలో ఈటల ఘర్ వాపసీ అంటూ అసెంబ్లీలో ఉన్న బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నినాదం చేశారు. మళ్ళీ ఈటలని బి‌ఆర్‌ఎస్ లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం మొదలైంది. దీనిపై ఈటల గట్టిగానే మాట్లాడారు. తనని గెంటేసిన పార్టీలోకి మళ్ళీ వెళ్ళే ప్రసక్తి లేదని, తనకు నష్టం కలిగించడానికే కే‌సి‌ఆర్ తనదైన శైలిలో మాట్లాడారని అన్నారు. మొత్తానికి మళ్ళీ కారు ఎక్కేది లేదని ఈటల అన్నారు.