ఎమ్మెల్యేలకు క్లాస్..ఆ ఇద్దరి పేర్లు హైలైట్!

మరొకసారి జగన్ వర్క్ షాప్ పెట్టి..వైసీపీ ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు. ఎవరైతే గడపగడపకు సరిగ్గా తిరగడం లేదో..వారి పేర్లు సెపరేట్ గా చెప్పి మరీ క్లాస్ ఇచ్చారు.ఇకనైనా ఎమ్మెల్యేలు గడపగడపకు వెళ్లాలని, ఏ మాత్రం నిర్లక్ష్యం చేసిన తగిన మూల్యం చెల్లించుకుంటరాని వార్నింగ్ కూడా ఇచ్చారు. కాకపోతే గతంలో మాదిరిగా ఈ సారి జగన్ సీరియస్ వార్నింగ్‌లు పెద్దగా ఇవ్వలేదు…కానీ కొంతమేర ఎమ్మెల్యేలని మందలించారు.

తాజాగా జరిగిన వర్క్ షాప్‌లో కీలక ఆదేశాలు ఇచ్చారు. వచ్చే నెల 18 తర్వాత రెండు నెలల పాటు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ ఎమ్మెల్యేలను..జగన్ ఆదేశించారు. గడప గడపకు కార్యక్రమంలో కొందరు మంత్రులు సహా 20 మంది ఎమ్మెల్యేలు వెనుకబడ్డారని, రోజుకు కనీసం రెండు గంటలు కూడా పాల్గొనడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో మార్చి 18 నుంచి గడపగడపకు వెళ్లాలని సూచించారు.

5.20 లక్షల మంది గృహ సారథులు.. 45,000 మంది సచివాలయ సమన్వయకర్తలు, రెండున్నర లక్షల మంది వలంటీర్ల వ్యవస్థతో వైసీపీ బలంగా ఉందని,  గెలుపే లక్ష్యంగా గృహసారథులను నియమించుకోవాలని, వచ్చే నెల 18 నుంచి 26వ తేదీ వరకూ వారికి శిక్షణ తరగతులు నిర్వహించాలని,  వచ్చే నెల 18, 19 తేదీల్లో వీటిలో ఎమ్మెల్యేలు తప్పకుండా పాల్గొనాలని, అలాగే రాష్ట్రంలో ప్రతి ఇంటికీ ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ అనే స్టిక్కర్లు అంటించాలని సూచించారు.

ఇక తదుపరి వర్క్ షాపుని మే నెలలో నిర్వహిస్తామని చెప్పారు. ఈ లోపు వెనుకబడిన వారంతా మంచి పనితీరు కనబర్చాలని చెప్పారు. అయితే గడపగడపకు వెనుకబడిన వారిలో ప్రధానంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కొడాలి నాని పేర్లు వినిపించాయి. వీరు చాలా తక్కువగా గడపగడపకు తిరిగారు.