టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ రాక.. కాక రేపుతున్న లక్ష్మీపార్వతి కామెంట్స్

ఏపీలో టీడీపీ గత ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదుర్కొంది. కేవలం 23 ఎమ్మెల్యే సీట్లను మాత్రమే గెలుచుకుంది. వైసీపీ ప్రభంజనంలో టీడీపీ తక్కువ సీట్లకే పరిమితం అయింది. దీంతో చంద్రబాబు నాయకత్వంపై కొందరు సందేహాలను లేవనెత్తుతున్నారు. చంద్రబాబుకు వయసు అయిపోయిందని, ఆయన తర్వాత పార్టీని నడిపించే సత్తా నారా లోకేష్‌కు లేదని కొందరు వాదిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు చేపట్టాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈ కోవలోకి లక్ష్మీపార్వతి కూడా చేరింది. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు చేపడితే పార్టీ బాగుపడుతుందని, అలా అయితే టీడీపీకి పునర్వైభవం వస్తుందని లక్ష్మీపార్వతి వాదిస్తోంది. ఈ క్రమంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

దివంగత ఎన్టీఆర్‌ తన జీవిత చరమాంకంలో లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నారు. అయితే కుటుంబ సభ్యులు వీరి వివాహాన్ని వ్యతిరేకించారు. తర్వాత పరిణామాలలో చంద్రబాబు టీడీపీ సారథ్య బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం టీడీపీ బలహీనంగా ఉందనేది కొందరి వాదన. లక్ష్మీపార్వతి కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేసింది. మొదటి నుంచి చంద్రబాబుకు వ్యతిరేకంగా పని చేసే ఆమె తాజా వ్యాఖ్యలు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. టీడీపీ అధ్యక్ష బాధ్యతలు జూనియర్ ఎన్టీఆర్‌కి ఇస్తేనే ఆయన రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. అలా చేస్తేనే పార్టీ బాగుపడుతుందని చెప్పింది.


జూనియర్ ఎన్టీఆర్ పగ్గాలు చేపడితే తాను టీడీపీలోకి తిరిగి వస్తానని చెప్పింది. ఇది తెలుసుకున్న టీడీపీ అభిమానులు ఆమెపై మండిపడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తాను ఎప్పటికీ టీడీపీకి చెందిన వాడినేనని చెప్పిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు. టీడీపీ తరుపున పని చేయడానికి తారక్ ఎప్పుడైనా వస్తాడని, గతంలో మాదిరిగా పార్టీలో చిచ్చు పెట్టొద్దని పేర్కొంటున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాలలో బిజీగా ఉన్నారు. ఆస్కార్ నామినేషన్‌కి ఎంపికవడంతో అమెరికాలో రాజమౌళితో కలిసి ప్రచారంలో ఉన్నారు.