మాజీ ఎంపీ తనయుడుకు పి.గన్నవరం సీటు?

తెలుగుదేశం పార్టీకి సరైన నాయకత్వం లేని నియోజకవర్గాల్లో కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం స్థానం ఒకటి. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి టీడీపీ తరుపున నేలపూడి స్టాలిన్ పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ నుంచి కొండేటి చిట్టిబాబు గెలిచారు. అయితే ఎమ్మెల్యే చిట్టిబాబుకు ఇప్పుడు అంత పాజిటివ్ లేదు. ఆయనపై వ్యతిరేకత స్పష్టంగానే కనిపిస్తోంది. కానీ టీడీపీ నుంచి సరైన నాయకుడు లేకపోవడం వైసీపీకి ప్లస్ గా మారింది. గత ఎన్నికల్లో టీడీపీ ఫండ్స్‌లో స్టాలిన్ అక్రమాలకు పాల్పడ్డారని చెబుతూ..టీడీపీ అధిష్టానం ఆయన్ని సస్పెండ్ చేసింది.

స్టాలిన్ సస్పెండ్ అయ్యాక ఇక్కడ బలమైన నాయకుడుని ఇంచార్జ్‌గా పెట్టలేదు. దీంతో పి.గన్నవరంలో టీడీపీ వీక్ గా కనిపిస్తోంది. అయితే ఈ సీటుపై కొత్త నాయకుడు కన్నేశారు. మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు శ్రీ రాజ్ టీడీపీలోకి రావడానికి సిద్ధమయ్యారని తెలిసింది. మొదట నుంచి కాంగ్రెస్ లో పనిచేస్తున్న హర్షకుమార్..రెండుసార్లు అమలాపురం ఎంపీగా పనిచేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల ముందు  టీడీపీలోకి వచ్చారు. కానీ అమలాపురం సీటు దక్కలేదు. దీంతో ఎన్నికల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారు.

అయితే కాంగ్రెస్ లో కీలక పదవి దక్కకపోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ఇదే సమయంలో ఇటీవల వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తో హర్షకుమార్ సమావేశమయ్యారు. దీంతో ఆయన వైసీపీలోకి వెళ్తారని ప్రచారం వచ్చింది. కానీ ఇదే వైసీపీ ప్రభుత్వంలో బోటు ప్రమాదంలో ప్రశ్నించినందుకు హర్షకుమార్ జైలు పాలైన విషయం తెలిసిందే. కాబట్టి హర్షకుమార్ వైసీపీలోకి వెళ్లరని తెలుస్తోంది.

ఇదే తరుణంలో తాజాగా హర్షకుమార్ తనయుడు శ్రీరాజ్..చంద్రబాబుతో భేటీ అయ్యారు. తాజా రాజకీయాలపై  చర్చించారు. ఇక ఆయన టీడీపీలోకి రావడానికి రెడీ అయ్యారని, పి.గన్నవరం సీటులో పోటీ చేస్తారని అంటున్నారు. ఇక జనసేనతో పొత్తు ఉంటే పి.గన్నవరం సీటు టీడీపీ సులువుగా దక్కించుకుంటుంది. మరి చూడాలి హర్షకుమార్ తనయుడు టీడీపీలోకి వస్తారో లేదో.