సిట్టింగులకు సీట్లు..ఎమ్మెల్యేలపై జగన్ సడన్ ప్రేమ..!

పనితీరు సరిగ్గా లేకపోతే ఎట్టి పరిస్తితుల్లోనూ నెక్స్ట్ ఎన్నికల్లో సీటు ఇచ్చే ప్రసక్తి లేదని, కాబట్టి తనని ఏం అనుకోవద్దు అని చెప్పి ఇదివరకు జరిగిన వర్క్ షాపుల్లో జగన్..ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. అలా వార్నింగ్ ఇచ్చిన జగన్..తాజా వర్క్ షాపులో పూర్తిగా రివర్స్ లో మాట్లాడారు. ఎమ్మెల్యేలంటే తనకు కోపం లేదని, అత్యంత ప్రేమ ఉందని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేలెవరినీ పోగొట్టుకోవడం ఇష్టం లేదని, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరినీ మళ్లీ చట్టసభలో చూడాలన్నదే తన అభిమతమని, అందరం కలిసి పనిచేస్తూ ఎన్నికల్లో విజయం సాధించాలన్నదే తన ఉద్దేశమని తాజా వర్క్ షాపులో వివరించారు.

అంటే సడన్ గా ఎమ్మెల్యేలపై ప్రేమ చూపించారు. మొన్నటివరకు వార్నింగ్ ఇచ్చి..ఇప్పుడు ఇలా మాట్లాడటానికి కారణాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీటు దక్కని వారు పార్టీ జంప్ అయిపోవడమో..లేక పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు ఉన్నాయని దాని వల్ల వైసీపీకే నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిసింది. అందుకే జగన్ సడన్‌గా ఎమ్మెల్యేలపై ప్రేమ చూపించినట్లు తెలిసింది.

అందుకే ఈ సారి వర్క్ షాప్‌లో ఎమ్మెల్యేలకు పెద్దగా వార్నింగ్ కూడా ఇవ్వలేదు. కాకపోతే కొంతమంది గడపగడపకు వెళ్ళడం లేదని చెప్పుకొచ్చారు. గడప గడపకు మన ప్రభుత్వంలో ఏకంగా 64 మంది ఎమ్మెల్యేలు పూర్తిస్థాయిలో పాల్గొనలేదని,  38 మంది పేర్లను చదివి వినిపించారు. ఈ జాబితాలో  మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి, మేరుగ నాగార్జున, విడదల రజని, చెల్లుబోయిన, జోగి రమేశ్‌, కారుమూరి నాగేశ్వరరావు, ధర్మాన ప్రసాదరావు, గుమ్మనూరు జయరాం, సీదిరి అప్పలరాజు ఉన్నారు.

అటు మాజీ మంత్రులు కొడాలి నాని, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, బాలినేని పేర్లు కూడా జాబితాలో ఉన్నాయి. అయితే వారికి పెద్ద వార్నింగ్ ఏమి ఇవ్వలేదు. గడపగడపకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని మాత్రం చెప్పారు. మొత్తానికి ఎమ్మెల్యేల విషయంలో జగన్ కాస్త మెత్తబడ్డారు.