మాజీ మంత్రికి బాబు హ్యాండ్..జంపింగ్ తప్పదా!

వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపులో యువతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు..ఇప్పటికే పలుమార్లు చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. యువ ఓటర్లని ఆకర్షించడం, నారా లోకేష్ నాయకత్వాన్ని బలపర్చేలా యువ నాయకత్వాన్ని పెంచే దిశగా చంద్రబాబు ముందుకెళుతున్నారు. ఇదే క్రమంలో పలు నియోజకవర్గాల్లో సీనియర్లని పక్కన పెట్టి యువ నేతలకు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు.

ఇదే సమయంలో ఉమ్మడి అనంతపురం జిల్లా పుట్టపర్తి సీటులో సైతం సీనియర్ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిని చంద్రబాబు పక్కన పెడతారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది. 2014లో పల్లె గెలిచి..చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రిగా చేసిన విషయం తెలిసిందే. ఇక మధ్యలోనే ఆయన మంత్రి పదవి పోయింది. ఇక 2019 ఎన్నికల్లో పుట్టపర్తి నుంచి పోటీ చేసి పల్లె ఓడిపోయారు. ఆ ఓటమి తర్వాత అక్కడ పల్లె బలపడటం లేదు. వైసీపీపై వ్యతిరేకత కనిపిస్తున్నా సరే దాన్ని ఉపయోగించుకుని బలపడటంలో పల్లె విఫలమవుతున్నారు.

పైగా ఇక్కడ ఆధిపత్య పోరు ఎక్కువైంది. పల్లెకు వ్యతిరేకంగా మున్సిపల్ మాజీ ఛైర్మన్ గంగన్న రాజకీయం చేస్తున్నారు. అటు సైకం శ్రీనివాసులు రెడ్డి సైతం సెపరేట్ గా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈయన సీటు సైతం ఆశిస్తున్నారు. అటు పెదరాసు సుబ్రమణ్యం సైతం పల్లెకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. దీంతో చంద్రబాబు సైతం పుట్టపర్తి సీటుని యువ నేతకు ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ సీటు దక్కకపోతే పల్లె టీడీపీని వదిలేస్తారనే ప్రచారం ఉంది. అయితే రాజ్యసభ గాని, ఎమ్మెల్సీ హామీ గాని వస్తే పల్లె సీటు త్యాగం చేస్తారని అంటున్నారు. చూడాలి మరి పుట్టపర్తి సీటు ఎవరికి దక్కుతుందో