విశాఖ ‘గర్జన’ వర్సెస్ ‘సేవ్’ ఉత్తరాంధ్ర..!

ప్రశాంతంగా ఉండే ఉత్తరాంధ్రలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. గత కొంతకాలంగా రాజధాని విషయంలో పెద్ద రచ్చ నడుస్తూనే ఉంది. ఎప్పుడైతే అమరావతి రైతులు…అమరావతి టూ అరసవెల్లి పాదయాత్ర మొదలుపెట్టారో అప్పటినుంచే ఉత్తరాంధ్రలోని వైసీపీ నేతలు..విశాఖని పరిపాలన రాజధాని అనే డిమాండ్‌తో ఉద్యమానికి సిద్ధమయ్యారు. అధికారంలో ఉన్నా, మూడేళ్ళ క్రితమే మూడు రాజధానులు ప్రకటించినా సరే..ఏదో ప్రతిపక్షంలో ఉన్నట్లుగా వైసీపీ నేతలు విశాఖ రాజధాని అని పోరాటం మొదలుపెట్టారు..అలాగే అమరావతి రైతుల పాదయాత్రని అడ్డుకుని తీరుతామని ప్రకటనలు చేస్తున్నారు.

అమరావతికి మద్ధతు తెలుపుతున్న టీడీపీ నేతలు ఉత్తరాంధ్ర ద్రోహులు అని ఫైర్ అవుతున్నారు. చంద్రబాబుని ఉత్తరాంధ్ర ప్రాంతంలో అడుగుపెట్టనివ్వమని సవాళ్ళు విసురుతున్నారు. ఇదే క్రమంలో ఈ నెల 15న వైసీపీ…విశాఖ గర్జన కార్యక్రమం చేయనుంది. ఇక పోటీగా టీడీపీ కూడా పోరాటానికి సిద్ధమైంది. అమరావతిని రాజధానిగా ఉంచాలని చెబుతూనే..విశాఖని అభివృద్ధి చేసింది తామే అని, మూడు ప్రాంతాల అభివృద్ధి కావాలని, అలాగే మూడు రాజధానుల పేరుతో ఉత్తరాంధ్రని వైసీపీ నేతలు దోచుకుంటున్నారని టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు.

అలాగే సేవ్ ఉత్తరాంధ్ర పేరుతో టీడీపీ సైతం పోరాటానికి సిద్ధమైంది. అటు జనసేన అధినేత పవన్ సైతం..అమరావతికి మద్ధతు తెలుపుతూ..మూడు రాజధానుల పేరుతో..రాష్ట్రాన్ని వైసీపీ నాశనం చేస్తుందని విరుచుకుపడుతున్నారు. అలాగే విశాఖ వేదికగా జనవాణి కార్యక్రమం పెట్టి వైసీపీకి కౌంటర్లు ఇవ్వాలని చూస్తున్నారు. అది కూడా ఈ నెల 15న విశాఖలో ప్రోగ్రాం పెట్టనున్నారు.

ఇక విశాఖలో రాజధాని అయితే రాయలసీమకు అన్యాయం జరుగుతుందని కొందరు ఆ ప్రాంత నేతలు మాట్లాడుతున్నారు. మొత్తానికి వైసీపీ తీసుకొచ్చిన మూడు రాజధానుల కాన్సెప్ట్ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా ఉంది. అసలు రాష్ట్రానికంటూ ఒక రాజధాని లేకుండా చేశారు..ఇప్పుడు అధికారంలో ఉండి కూడా ఉద్యమం అంటూ రాజకీయ లబ్ది పొందడానికి కొత్త గేమ్ స్టార్ట్ చేసినట్లు కనిపిస్తున్నారు. మరి ఈ రాజధాని రగడ ఎప్పటికీ ఆగుతుందో చూడాలి.