వెస్ట్ మళ్ళీ స్వీప్..వైసీపీ స్కెచ్ ఏంటి?

ప్రజలు అన్నీ మంచి పనులే చేస్తున్నాం…ఈ సారి 175కి 175 సీట్లు గెలిచేస్తామనే ధీమాలో సీఎం జగన్ ఉన్న విషయం తెలిసిందే..ఎలాగైనా మళ్ళీ అధికారం దక్కించుకోవాలని జగన్ చూస్తున్నారు..ఈ సారి జగన్‌కు చెక్ పెట్టి అధికార పీఠం ఎక్కాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం..ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్నారు. ఇదే క్రమంలో చంద్రబాబు-పవన్ కలిసిన విషయం తెలిసిందే…ఇక నెక్స్ట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం దాదాపు ఖాయమైపోయింది.

ఒకవేళ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే వైసీపీకి మళ్ళీ ఛాన్స్ ఉండేది..కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో వైసీపీకి రిస్క్ కనిపిస్తోంది. కొన్ని జిల్లాల్లో వైసీపీకి టీడీపీ-జనసేనలు ఈజీగా చెక్ పెట్టడం ఖాయమే. పొత్తు దాదాపు ఫిక్స్ కాబట్టి..ఆ రెండు పార్టీలు కలిసి..కొన్ని జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేయడం కూడా ఖాయమే అని ప్రచారం జరుగుతుంది. ఇదే క్రమంలో కొత్త జిల్లాల ప్రకారం చూసుకుంటే..భీమవరం కేంద్రంగా ఏర్పడిన పశ్చిమ గోదావరి జిల్లాల్లో టీడీపీ-జనసేన సత్తా చాటడం ఖాయమని తెలుస్తోంది.

కొత్తగా ఏర్పడిన పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, ఉండి, ఆచంట, తణుకు నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఉండి, పాలకొల్లు సీట్లు టీడీపీ గెలుచుకోగా, మిగిలిన సీట్లు వైసీపీ గెలుచుకుంది. అయితే అప్పుడు వైసీపీ గెలవడానికి ఏకైక కారణం జనసేన ఓట్లు చీల్చడం. అన్నీ నియోజకవర్గాల్లో అదే పరిస్తితి. ఒక్క నరసాపురంలో మాత్రం వైసీపీకి గట్టి పోటీ ఇచ్చి జనసేన రెండోస్థానంలో నిలిచింది.

మిగిలిన స్థానాల్లో మూడో స్థానంలో ఉంది. అయితే టీడీపీపై వైసీపీ సాధించిన మెజారిటీలు కంటే జనసేనకు పడిన ఓట్లే ఎక్కువ. అంటే ఈ సారి ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో..వెస్ట్‌లో క్లీన్ స్వీప్ చేయడం ఖాయమే అని చెప్పొచ్చు. మరి టీడీపీ-జనసేనలని నిలువరించడానికి వైసీపీ ఎలాంటి స్కెచ్‌తో ముందుకొస్తుందనేది చూడాలి.