రాజానగరంలో రాజాకు టీడీపీతో నో ప్రాబ్లం..కానీ..!

రాష్ట్రంలో అధికార వైసీపీ ఎమ్మెల్యేలపై కాస్త వ్యతిరేకత పెరుగుతున్న విషయం తెలిసిందే…151 మంది ఎమ్మెల్యేలు ఉంటే..దగ్గర దగ్గరగా 50 మంది వరకు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని సర్వేల్లో తేలుతుంది.  అయితే వ్యతిరేకత తక్కువ ఉంటూ, స్ట్రాంగ్‌గా ఉన్న ఎమ్మెల్యేలు ఎక్కువగానే ఉన్నారు. అలా తక్కువ వ్యతిరేకత ఉన్నవారిలో రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కూడా ఒకరు. గత ఎన్నికల్లో దాదాపు 31 వేల ఓట్లపైనే మెజారిటీతో రాజా గెలిచారు.

తొలిసారి ఎమ్మెల్యే అయిన రాజా..తనదైన శైలిలో పనిచేసుకుంటూ ముందుకెళుతున్నారు. ప్రజల్లోనే ఉంటున్నారు..అటు ప్రభుత్వ పథకాలు ప్లస్. కాకపోతే ఈయన కుటుంబంలోని కొందరు భూ అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి..అదేవిధంగా అనుకున్న విధంగా అభివృద్ధి జరగకపోవడం మైనస్. కానీ టీడీపీ నేత పెందుర్తి వెంకటేష్ వీక్‌గా ఉండటం రాజాకు పెద్ద ప్లస్. 2009, 2014 ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన వెంకటేష్..గత ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు.

అధికారంలో ఉన్నప్పుడు ఈయనపై చాలా ఆరోపణలు వచ్చాయి. అవే నెగిటివ్..పైగా ప్రతిపక్షంలో ఉంటూ ఇప్పుడు ప్రజల్లో ఉంటూ పోరాటాలు చేయడం తక్కువ. తాజాగా అదే విషయంపై చంద్రబాబు కూడా..వెంకటేష్‌కు క్లాస్ పీకారు. సరిగ్గా పనిచేయడం లేదని, బాదుడే బాదుడు కార్యక్రమం కూడా నిర్వహించడం లేదు..ప్రజల్లో కూడా ఎక్కువ ఉండటం లేదని, ఇలా అయితే పక్కకు తప్పిస్తానని వార్నింగ్ ఇచ్చారు.

వెంకటేష్ వల్ల రాజాకు పెద్ద ప్లస్. అసలు టీడీపీకి అనుకూలంగా ఉండే కమ్మ వర్గాన్ని కూడా రాజా తనవైపుకు తిప్పుకుంటున్నారంటే..వెంకటేష్ పనితీరు ఎలా ఉందో అర్ధంచేసుకోవచ్చు. సరే వెంకటేష్ వల్ల రాజాకు ప్లస్ అనుకుంటే..జనసేనతో రిస్క్ ఉంది. ఎందుకంటే టీడీపీ-జనసేన కలిసి పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే రాజాకు కాస్త రిస్క్. గత ఎన్నికల్లో జనసేనకు రాజానగరంలో 20 వేల ఓట్ల వరకు వచ్చాయి. కాకపోతే రాజా మెజారిటీ 31 వేలు. అయితే ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు, జనసేన ఓట్లు కలిస్తే…రాజాకు ఇబ్బంది. కాబట్టి రాజానగరం రాజకీయం ఎలా అయినా మారిపోవచ్చు.